ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన, మరణ ధృవీకరణ పత్రాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా జన్మించినా లేదా మరణించినా ఆ విషయాన్ని కేవలం 21 రోజుల్లోపే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. ఒకవేళ ఈ మూడు వారాల గడువు దాటితే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఒకవేళ మీరు 21 రోజులు దాటిన తర్వాత నిద్రలేస్తే, జరిమానా కట్టక తప్పదు. పుట్టిన తేదీ లేదా చనిపోయిన తేదీ నుంచి 22వ రోజు నుంచి నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 25 రూపాయల జరిమానా కట్టాలి. అదే నెల రోజులు దాటి ఏడాది లోపు అయితే, 250 రూపాయల జరిమానాతో పాటు జిల్లా రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇక ఏడాది కూడా దాటిపోయిన పాత కేసులకైతే తిప్పలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏడాది దాటిన తర్వాత నమోదు చేయాలంటే 500 రూపాయల పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఆర్డీవో లేదా జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్లు తీసుకురావాల్సి ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా ఒక రూల్ పెట్టారు. బిడ్డ పుట్టిన ఏడాది లోపు పేరు నమోదు చేసుకుంటే ఫ్రీ, కానీ ఏడాది దాటితే మాత్రం దానికి కూడా 250 రూపాయలు వసూలు చేస్తారు.
అటు చదువుకునే పిల్లల కోసం కూడా ఏపీ సర్కార్ కొన్ని మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే ‘నీట్’ పరీక్ష రాయడం తప్పనిసరి చేశారు. నీట్ ర్యాంకు ఉంటేనే నర్సింగ్ సీటు ఇస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలోలాగా లోకల్ ఎంట్రన్స్ పరీక్షలు ఉండవు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మరోవైపు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం మార్చి మొదటి వారంలో హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు. వీటిని వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్టికెట్లలో పేర్లు లేదా డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఏవైనా తప్పులు ఉంటే, రిజల్ట్స్ వచ్చేలోపు ఎప్పుడైనా సరిదిద్దుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.
