ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లుగా నిర్ణయించారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి, ముఖ్యంగా మహిళలు మరియు రైతుల అభివృద్ధికి పెద్దపీట వేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న సూపర్ సిక్స్ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు. పాఠశాల విద్యకు రూ. 32,308 కోట్లు, వైద్య శాఖకు రూ. 19,306 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 11,745 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి రూ. 11,118 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 23,650 కోట్లు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖకు రూ. 22,941 కోట్లు, జలవనరులకు రూ. 18,223 కోట్లు కేటాయించారు.
పెన్షన్ల పెంపు కోసం ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ. 27,719 కోట్లు కేటాయించారు. ప్రతి నెలా ఒకటో తేదీన అర్హులైన వారికి పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన ఉందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి తోడు స్త్రీశక్తి పథకానికి రూ. 1,420 కోట్లు కేటాయించారు. ఇకపై ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. తల్లికి వందనం పథకానికి రూ. 9,668 కోట్లు, స్త్రీ-శిశు సంక్షేమానికి రూ. 4,581 కోట్లు కేటాయించారు. వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ కోసం రూ. 600 కోట్లు, ఆటో డ్రైవర్లకు రూ. 450 కోట్లు ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి లక్షాధికారులుగా తయారు చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
రైతుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6,600 కోట్లు కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి రూ. 500 కోట్లు, మత్స్యకారులకు రూ. 260 కోట్లు ఇచ్చారు. పంటల బీమా కోసం రూ. 250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజనకు రూ. 190 కోట్లు కేటాయించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తంగా ఈ బడ్జెట్లో సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
https://varthaprabhanjanam.com/chicken-mutton-fish-shops-to-remain-shut-in-vizag-on-feb-15/
