AP LPG Supply News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న వంటగ్యాస్ (LPG) ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) భేటీలో గ్యాస్ సరఫరా, కొత్త ఇంధన విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు అడుగులు
ప్రస్తుతం సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, నేరుగా ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే ‘పైప్‌డ్ నేచురల్ గ్యాస్’ (PNG) విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీని కోసం “న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్” అనే కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనివల్ల కలిగే ఉపయోగాలు
సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు నేరుగా అందుతాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య విభాగాలకు గ్యాస్ కొరత తీరుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల మంది పీఎన్‌జీ వాడుతుండగా, దీన్ని మరింత విస్తరించనున్నారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ రోజు (మార్చి 26) విశాఖపట్నం పోర్టుకు ఒక భారీ ఎల్‌పీజీ ట్యాంకర్ చేరుకోనుంది. ఇది రాగానే రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు మరింత పెరుగుతాయని, సిలిండర్ల సరఫరా వేగవంతం అవుతుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వచ్చే వారం నుంచి హోటళ్లు, హాస్టళ్లకు కూడా సిలిండర్ల సరఫరాను పెంచి, ఎక్కడా వ్యాపారాలు ఆగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 800 కేసులు నమోదు చేసి, సుమారు 3,540 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత కూడా లేదని, ధరల విషయంలో ఎవరైనా మోసం చేస్తే టోల్ ఫ్రీ నంబరు 1967 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
