ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Farmers New) భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తోంది. అయితే, ఈ పుస్తకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. .ఈ నిబంధన ప్రకారం, ప్రతి నెలా కేవలం 9వ తేదీ వరకు మాత్రమే రైతులు తమ వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఏ కారణంతోనైనా 9వ తేదీ దాటితే, ఆ నెలలో ఇక ఈ-కేవైసీ చేయడానికి సాఫ్ట్వేర్ లేదా యాప్ పనిచేయదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు తమ పొలం పనుల్లో ఉండి లేదా వేరే పనుల వల్ల సకాలంలో రాకపోవడంతో, 10వ తేదీన వెళ్లినా అధికారులు వారిని వెనక్కి పంపిస్తున్నారు.
వచ్చే నెల వరకు ఆగాల్సిందే” అని సమాధానం ఇస్తుండటంతో, కొత్త పాసుపుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో పంపిణీ చేసిన కొన్ని పుస్తకాల్లో పేర్లు తప్పుగా పడటం, విస్తీర్ణం తేడా రావడం వంటి పొరపాట్లు జరిగాయి. వీటిని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో, ఇప్పుడు అధికారులు వివరాలన్నీ సరిచూసి, ఈ-కేవైసీ అయ్యాకే ప్రింటింగ్‌కు పంపుతున్నారు. ఈ నెలలో సుమారు 1.83 లక్షల పుస్తకాలను సిద్ధం చేశారు.
అయితే, ఈ 9వ తేదీ గడువు వల్ల సామాన్య రైతులకు పనులు కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ గడువును తొలగించి, ఎప్పుడైనా ఈ-కేవైసీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
