Gas Subsidy AP: సిలిండర్ అవసరం లేదు.. 24 గంటల్లోనే గ్యాస్ కనెక్షన్.. ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్!

Gas Subsidy AP

Gas Subsidy AP

Gas Subsidy AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల స్థానంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను ప్రోత్సహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ‘దీపం-2’ పథకం లబ్ధిదారులకు ఈ కొత్త విధానం ద్వారా మరింత ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ మీరు సిలిండర్ వదిలేసి పైప్డ్ గ్యాస్ కనెక్షన్‌కు మారితే, ప్రభుత్వం మీకు ఏడాదికి రూ. 2,400 రాయితీని నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

రాష్ట్రంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 10 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని కేబినెట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ నగరాల్లో ప్రధాన పైప్‌లైన్లు సిద్ధంగా ఉన్నందున, సాధ్యమైనంత త్వరగా ఇంటింటికీ గ్యాస్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించింది.

దీపం పథకం కింద ప్రయోజనం పొందుతున్న వారు పీఎన్‌జీ కనెక్షన్‌ తీసుకున్నా, వారి రాయితీకి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఈ రూ. 2,400 నగదును ప్రభుత్వం ఒకేసారి కాకుండా, ప్రతి రెండు నెలలకు ఒకసారి బిల్లింగ్ సైకిల్ ప్రకారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో (DBT ద్వారా) జమ చేస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 500 రాయితీ కూడా వినియోగదారులకు అందుతుంది. ఇది సామాన్యులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం.

పైప్ లైన్ల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం నిబంధనలను సులభతరం చేసింది. ఎవరైనా పీఎన్‌జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, నగరపాలక సంస్థలు కేవలం 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో అధికారులు స్పందించకపోతే, ఆ అనుమతి లభించినట్లుగానే భావించి పనులు మొదలుపెట్టవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలకు ఈ కనెక్షన్ల విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. కొందరు కావాలని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా జరుగుతోందని, త్వరలోనే తిరుమల వంటి ప్రధాన దేవాలయాలు, అన్న క్యాంటీన్లకు కూడా పీఎన్‌జీ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.