ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు కల్పించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఇప్పుడు దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు భారీ ఊరట లభించనుంది.
గత ఏడాది డిసెంబరులో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఇంద్రధనస్సు’ పేరుతో ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు. అందులో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అత్యంత కీలకమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేయగా, ఇప్పుడు జీవో విడుదల కావడంతో అమలుకు మార్గం సుగమమైంది. కేవలం మహిళలకే కాకుండా, పురుష దివ్యాంగులకు కూడా ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుండటం విశేషం.
ప్రస్తుతం మహిళలకు ఏయే బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం ఉందో, అవే బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.
సిటీ ఆర్డినరీ బస్సులు
పల్లెవెలుగు
అల్ట్రా పల్లెవెలుగు
మెట్రో ఎక్స్‌ప్రెస్
ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
పైన పేర్కొన్న బస్సుల్లో రూపాయి ఖర్చు లేకుండా దివ్యాంగులు ప్రయాణం చేయవచ్చు. అయితే, అంతర్రాష్ట్ర సర్వీసులు నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ వంటి లగ్జరీ బస్సుల్లో మాత్రం పాత పద్ధతిలోనే 50 శాతం రాయితీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఉచిత ప్రయాణ సదుపాయం పొందాలంటే దివ్యాంగులకు కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఆధారంగా జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపిస్తే సరిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు లెక్కలు ఉన్నప్పటికీ, కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాస్‌లను వాడుతున్నారు. తాజా నిర్ణయంతో మిగిలిన వారు కూడా పాస్‌లు పొందే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం పట్ల దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం పట్టణాలకు వచ్చే దివ్యాంగులకు ఈ ఉచిత ప్రయాణం ఆర్థికంగా పెద్ద అండగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఆర్టీసీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను క్షేత్రస్థాయి అధికారులకు పంపనుంది.
