AP Tourism News: 2029 నాటికి ఏపీలో 50 వేల హోటల్ గదులు – పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు భారీ రివ్యూ!

AP Tourism News

AP Tourism News

AP Tourism News: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తాజాగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగాన్ని ఒక ఆర్థిక ఇంజిన్‌లా మార్చాలని, రాష్ట్ర ఆదాయంలో దీని వాటా పెరిగేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

రాబోయే 2029 సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 50 వేల హోటల్ గదులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. పర్యాటకులు వచ్చినప్పుడు వారికి సరైన బస దొరకడమే అతిపెద్ద సమస్యగా మారుతోందని, అందుకే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి భారీగా గదుల నిర్మాణం జరగాలని సూచించారు. వీటితో పాటు స్థానిక ఉపాధిని పెంచేందుకు 10 వేల హోం స్టేలను (ఇళ్లలోనే పర్యాటకుల బస) కూడా సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలైన విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అమ్యూజ్‌మెంట్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గండికోట, అరకు, బొర్రా గుహలు, సూర్యలంక వంటి ప్రాంతాలను కేవలం సందర్శక స్థలాలుగానే కాకుండా, ప్రపంచ స్థాయి అనుభూతినిచ్చే పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు.

మరోవైపు ఆధ్యాత్మిక పర్యాటకానికి (టెంపుల్ టూరిజం) పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ‘ప్రసాద్’, ‘స్వదేశ్ దర్శన్’ కింద చేపట్టిన పనులను 2026 మే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించారు. ఈ పథకాల ద్వారా వివిధ దేవాలయాల అభివృద్ధికి మరో రూ. 663 కోట్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. గోదావరి పుష్కర ఘాట్లు, రాజమండ్రిలోని హావ్ లాక్ బ్రిడ్జి పనులను ఈ ఏడాది డిసెంబరులోగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో అడవులు మరియు ప్రకృతి అందాలను చూసేందుకు వీలుగా ‘ఎకో టూరిజం’ను కూడా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. కారావాన్ పార్కుల ఏర్పాటు, కారావాన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని, ప్రభుత్వ లక్ష్యాలను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.