Bill Gates Energy News : వ్యూహం మార్చిన బిల్‌ గేట్స్.. కొత్త పెట్టుబడుల కంటే పాత వాటికే ప్రాధాన్యత!

Bill Gates Energy News

Bill Gates Energy News

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా వినూత్న సాంకేతికతలను ప్రోత్సహించే దిశగా బిల్‌ గేట్స్ స్థాపించిన బ్రేక్‌త్రూ ఎనర్జీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన ప్రధాన నిధులలో ఒకటైన కాటలిస్ట్ ఫండ్ ద్వారా కొత్త పెట్టుబడులు పెట్టడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్లైమేట్ పాలసీలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న కఠిన వైఖరి నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఏమిటీ కాటలిస్ట్ ఫండ్?

పర్యావరణ హితమైన సరికొత్త ఆవిష్కరణలను వాణిజ్యపరంగా విజయవంతం చేసేందుకు 2021లో బిల్‌ గేట్స్ ఈ కాటలిస్ట్ ఫండ్‌ను ప్రారంభించారు. సాధారణంగా కొత్త టెక్నాలజీలు భారీ ఖర్చుతో కూడుకుని ఉండటం వల్ల, వాటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ఇన్వెస్టర్లు వెనుకాడుతుంటారు. అటువంటి స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు గేట్స్ సుమారు 1 బిలియన్ డాలర్ల నిధిని సేకరించారు. ఇప్పటివరకు సుమారు 10 స్టార్టప్‌లలో వందల మిలియన్ల డాలర్లను ఈ ఫండ్ ద్వారా పెట్టుబడిగా పెట్టారు. అయితే ఇప్పుడు కొత్త కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం కంటే, ఇప్పటికే నిధులు పొందిన సంస్థల నిర్వహణపై దృష్టి సారించాలని సంస్థ నిర్ణయించింది.

ట్రంప్ విధానాల ఎఫెక్ట్?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, గత బైడెన్ ప్రభుత్వం పర్యావరణ రంగం కోసం ప్రవేశపెట్టిన ‘ఇన్‌ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్’ (IRA) కింద కేటాయించిన భారీ నిధులను రద్దు చేయడం ప్రారంభించారు. దీనివల్ల గ్రీన్ టెక్నాలజీ రంగంలో ఉన్న స్టార్టప్‌లకు అందాల్సిన ప్రభుత్వ మద్దతు నిలిచిపోయింది. రాజకీయంగా వస్తున్న ఈ మార్పుల వల్ల క్లైమేట్ టెక్ ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. మార్కెట్ ఒక్కటే పర్యావరణ మార్పులను అడ్డుకోలేదని, ప్రభుత్వ మద్దతు కచ్చితంగా ఉండాలని బిల్‌ గేట్స్ గతంలోనే హెచ్చరించారు.

ఉద్యోగుల తొలగింపు

ఈ వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో బ్రేక్‌త్రూ ఎనర్జీ కాటలిస్ట్ విభాగం తన సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా కాటలిస్ట్ ఫండ్ మాజీ అధినేత మారియో ఫెర్నాండెజ్‌తో సహా పలువురు కీలక ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. భవిష్యత్తులో పనితీరును మెరుగుపరిచేందుకు చిన్న టీమ్‌తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కేవలం అమెరికాలోనే కాకుండా యూరప్‌లో కూడా తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు సమాచారం.

పర్యావరణ లక్ష్యాల సాధనలో కొన్ని విఫల ప్రయత్నాలు ఉంటాయని గేట్స్ గతంలోనే అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పారిస్ క్లైమేట్ ఒప్పందం పట్ల, కార్బన్ ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం పట్ల తన నిబద్ధత మారలేదని ఆయన స్పష్టం చేశారు. జెఫ్ బెజోస్, మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ వంటి దిగ్గజాలు ఈ బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, కాటలిస్ట్ ఫండ్ మాత్రం స్వతంత్రంగా పనిచేస్తోంది. ఈ తాజా పరిణామం క్లైమేట్ టెక్ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు కొంత ఆందోళన కలిగించే విషయమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.