Boddengi Purugu Curry : మటన్, చికెన్ కూడా సరితూగవు.. ఈత చెట్టులో దాగి ఉన్న వెన్నలాంటి రుచి, ప్రోటీన్ల నిధి!

Boddengi Purugu Curry

Boddengi Purugu Curry

ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన మన్యం ప్రాంతం కేవలం పచ్చని చెట్లకు, కాఫీ తోటలకే కాదు.. వైవిధ్యమైన ఆహారపు అలవాట్లకు కూడా పెట్టింది పేరు. ఆధునిక ప్రపంచం పిజ్జాలు, బర్గర్ల వెంట పరుగులు తీస్తుంటే, ఇక్కడి గిరిజనులు మాత్రం తమ పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయక రుచులనే ప్రాణప్రదంగా భావిస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బోడ్డెంగి పురుగు కూరా వంటకం గురించి. వినడానికి వింతగా అనిపించినా, ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని వారు నమ్ముతారు.

బోడ్డెంగి పురుగు ఈత చెట్టులో నుండి తీస్తారు ఒక ఈత చెట్టుకి   ఒకటి లేదా రెండు పురుగు అనేది లభించడం విశేషం అని చెప్పుకోవాలి. వర్షాకాలం తర్వాత ఈత చెట్ల మొదళ్లలో, చనిపోయిన ఈత మొక్కల్లో ఈ పురుగులు పెరుగుతాయి. వీటిని గుర్తించడం అంత సులభం కాదు. గిరిజన మహిళలు, పురుషులు తమ ఆయుధాలైన గొడ్డలి, కత్తి  పట్టుకుని అడవిని జల్లెడ పడతారు. చనిపోయిన ఈత మొక్కలను గుర్తించి, వాటి దుంపలను తవ్వి లోపల నివసించే ఈ పురుగులను ఎంతో ఓపిగ్గా సేకరిస్తారు.  సేకరించిన పురుగులతో  కూరను ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దాం మరి.

ఈత పురుగుల కూర తయారీ విధానం కూడా వైవిధ్యంగా ఉంటుంది. ముందుగా సేకరించిన పురుగులను శుభ్రం చేసి, వాటి తల భాగంలో చిన్న గాట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల లోపల ఉండే పోషకమైన రసం మసాలాలతో కలిసి మంచి రుచిని ఇస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం-వెల్లుల్లి ముద్ద  స్థానిక మసాలాలను ఉపయోగించి ఈ కూరను సిద్ధం చేస్తారు.  వంట పూర్తయ్యాక ఇది వెన్నలాంటి రుచిని కలిగి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

ఈ వంటకం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, వారి సంస్కృతిలో ఒక భాగం. వన్యప్రాంతాల్లో దొరికే వనరులను వృధా చేయకుండా, వాటిలోని పోషక విలువలను గుర్తించిన గిరిజనుల విజ్ఞతకు ఇది నిదర్శనం. ఈ పురుగులలో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయని, శరీరానికి శక్తినిస్తాయని గిరిజన పెద్దలు చెబుతుంటారు.
నేటి డిజిటల్ యుగంలో ఇటువంటి అరుదైన వంటకాలు మరుగున పడిపోకుండా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. అరకు సంప్రదాయాలను, వారి జీవనశైలిని ప్రతిబింబించే ఇటువంటి వంటకాలు పర్యాటకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.