T20WorldCup2026 : నిజం ఒప్పుకో బాబర్.. పాకిస్థాన్ కెప్టెన్ బ్యాటింగ్‌పై డు ప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు..!

T20WorldCup2026

T20WorldCup2026

T20WorldCup2026 : ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా వెలిగిన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అతని నెమ్మదైన బ్యాటింగ్ శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డు ప్లెసిస్, బాబర్‌కు అలాగే పాక్ కోచ్ మైక్ హెస్సన్‌కు ఒక విలువైన సలహా ఇచ్చారు. బాబర్ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే జట్టు యాజమాన్యం ముందుగా ‘నిజాయితీ’తో కూడిన చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్లెసిస్ మాట్లాడుతూ.. “ఏ సంభాషణకైనా పునాది నిజాయితీ. ఒక కోచ్‌గా లేదా కెప్టెన్‌గా ఆటగాళ్లతో ముక్కుసూటిగా మాట్లాడాలి. విషయాన్ని దాటవేస్తూ మాట్లాడితే అది ప్లేయర్‌ను మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది. బాబర్ విషయంలో కోచ్ మైక్ హెస్సన్ గణాంకాలను (Stats) ముందు పెట్టి మాట్లాడాలి. ఈ నంబర్లు ఏం చెబుతున్నాయో చూడు అని నిలదీస్తే, ఏ ఆటగాడూ కాదనలేడు. అప్పుడే మార్పు మొదలవుతుంది” అని డు ప్లెసిస్ చెప్పుకొచ్చారు.

తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ.. “మనం సౌకర్యంగా ఉన్నంత కాలం ఎదగలేం. కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. నా కెరీర్‌లో స్పిన్ ఆడటానికి నేను కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నాను. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వేరు, మ్యాచ్‌లో ప్రదర్శించడం వేరు. బాబర్ ప్రస్తుతం రెండు మనసుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన ఆటలో ఉన్న లోపాలను ముందుగా అతను అంగీకరించాలి. అప్పుడే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది” అని ఆయన విశ్లేషించారు.

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో కీలక దశలో ఉంది. ఇలాంటి సమయంలో బాబర్ ఆజం లాంటి సీనియర్ ఆటగాడు తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడటం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి డు ప్లెసిస్ ఇచ్చిన ఈ సలహాను పాక్ మేనేజ్‌మెంట్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.