T20 World Cup 2026: వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ చెప్పిన ఆ ఒక్క మాట.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్యకుమార్!

T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత్.. యావత్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, మైదానంలో ఆటగాళ్ల విన్యాసాలు ఒకెత్తయితే, తెర వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందించిన వ్యూహాలు, మాటలు జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాయి. ట్రోఫీ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ మాట్లాడిన భావోద్వేగపూరిత మాటలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా పంచుకున్నారు.

విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ జట్టును ఉద్దేశించి మాట్లాడుతూ.. “మనం ఏటా ఎన్నో సిరీస్‌లు ఆడతాం, వందల మ్యాచ్‌లు గెలుస్తాం. కానీ అవన్నీ కాలక్రమేణా మరుగున పడిపోతాయి. దేశం తరపున వరల్డ్ కప్ గెలవడం అనేది ఒక చరిత్ర. దీనికంటే మించిన గౌరవం మరోటి ఉండదు. మీరు ఈ రోజు సాధించిన ఈ ట్రోఫీని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది” అని అన్నారట. గంభీర్ చెప్పిన ఈ మాటలు ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయని సూర్యకుమార్ వెల్లడించారు.

టోర్నమెంట్ ఆరంభంలో గంభీర్ చాలా సీరియస్‌గా ఉండేవారని సూర్య గుర్తు చేసుకున్నారు. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో జట్టు ఆటతీరుపై ఆయన చాలా ఫోకస్‌గా ఉండేవారని, కనీసం నవ్వుతూ కూడా కనిపించలేదని సరదాగా చెప్పారు. కానీ సూపర్-8 దశ నుంచి భారత్ వరుసగా 250కి పైగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థులను భయపెడుతుంటే, గంభీర్ ముఖంలో ఆనందం కనిపించిందని తెలిపారు. జట్టు దూకుడుగా ఆడుతుంటేనే కోచ్‌కు నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటం భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టమని కెప్టెన్ అభివర్ణించారు. భారతదేశంలోనే ఈ టోర్నీ జరగడం తమకు కలిసి వచ్చిందని, ఇక్కడి పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటమే విజయానికి కీలకమని చెప్పారు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగడం వల్ల ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదని, ఫైనల్‌లో 96 పరుగుల భారీ తేడాతో గెలవడం తమ ఆధిపత్యాన్ని చాటుతోందని సూర్యకుమార్ గర్వంగా చెప్పారు.

భారత జట్టు సాధించిన ఈ ఘన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అహ్మదాబాద్ మైదానంలో లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య ట్రోఫీని గెలవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని టీమిండియా సభ్యులు భావిస్తున్నారు. గంభీర్ మార్గదర్శకత్వంలో యువ ఆటగాళ్లు కూడా అద్భుతమైన పరిణతి కనబరిచారని, ఈ గెలుపు భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.