సాధారణంగా రోడ్డుపై పెట్రోల్ లేదా ఆయిల్ ట్యాంకర్లు బోల్తా పడినప్పుడు జనం ఎగబడటం మనం చూస్తుంటాం. కానీ, ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు పోటీ పడి మరీ నెయ్యిని తోడేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిందెలు, బకెట్లు, బాటిళ్లు.. ఇలా ఏది దొరికితే దాంతో నెయ్యిని పట్టుకుపోవడానికి జనం ఎగబడటంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది.
ఈ ప్రమాదం కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పూణే నుంచి సుమారు 21 వేల లీటర్ల స్వచ్ఛమైన నెయ్యితో ఈ ట్యాంకర్ తిరుమలకు బయలుదేరింది. అయితే, చిత్రావతి వంతెన వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్యాంకర్ ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌కు రంధ్రాలు పడటంతో లోపల ఉన్న నెయ్యి అంతా బయటకు ప్రవహించడం మొదలైంది. ఇది గమనించిన స్థానికులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలియకముందే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ వార్త పాకిపోయింది. దీంతో జనం క్యూ కట్టారు. చేతిలో బిందెలు, బకెట్లు ఉన్నవారే కాకుండా, కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద డ్రమ్ములను కూడా తెచ్చి నెయ్యిని నింపుకున్నారు. వంతెన కింద పారుతున్న నెయ్యిని తోడుకోవడానికి పోటీ పడ్డారు. ట్యాంకర్ నుంచి కారుతున్న నెయ్యి వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా లీటర్ల కొద్దీ నెయ్యిని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు లాఠీలతో జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే ట్యాంకర్‌లో ఉన్న 21 వేల లీటర్ల నెయ్యిలో దాదాపు 20,500 లీటర్లు ఖాళీ అయిపోయింది. చివరకు పోలీసులు స్వాధీనం చేసుకునే సమయానికి కేవలం 500 లీటర్లు మాత్రమే ట్యాంకర్‌లో మిగిలింది. టీటీడీకి పంపాల్సిన నెయ్యి ఇలా జనం పాలు కావడంతో భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాద సమయంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాహనం అతి వేగంగా ఉండటమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, రోడ్డుపై పడిన నెయ్యి కారణంగా వాహనాలు జారిపోయే ప్రమాదం ఉండటంతో రహదారిపై ఇసుకను చల్లించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. భక్తి భావంతో ఉండాల్సిన నెయ్యిని ఇలా ప్రజలు పోటీ పడి దోచుకోవడంపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
