Donald Trump Strategy: భారత్‌కు తప్పదా చమురు కష్టాలు? అమెరికా వ్యూహం వెనుక అసలు కథ ఇదేనా!

Donald Trump Strategy

Donald Trump Strategy

అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో హర్మూజ్ జలసంధి ఇప్పుడు హాట్ టాపిక్. ఇరాన్ హెచ్చరికలు, బీమా కంపెనీల షాక్, ట్రంప్ మౌనం.. ఇవన్నీ కలిపి చూస్తే భారత్ లాంటి దేశాలకు భారీ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు ‘లైఫ్ లైన్’ లాంటి హర్మూజ్ జలసంధిలో రాకపోకలు నిలిచిపోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే, ఈ సంక్షోభం కేవలం యుద్ధం వల్ల వచ్చిందా? లేక దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ కుట్ర ఉందా? అన్న కోణంలో రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా ఏదైనా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే రవాణా ఆగుతుంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ దాడుల కంటే ముందుగానే, అంతర్జాతీయ బీమా సంస్థలు నౌకలకు ఇచ్చే రక్షణ కవచాన్ని రద్దు చేయడం లేదా ప్రీమియం ధరలను ఆకాశానికి పెంచేయడం గమనార్హం. దీనివల్ల నౌకల యజమానులు తమ షిప్పులను హర్మూజ్ దాటించడానికి భయపడుతున్నారు. రాత్రికి రాత్రే జరిగిన ఈ మార్పుల వెనుక అమెరికా ఒత్తిడి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చమురు రవాణాను స్తంభింపజేయడం ద్వారా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలనేది వాషింగ్టన్ ప్లాన్ కావచ్చని భావిస్తున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, చమురు ధరలపై విమర్శలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ ఇష్యూపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీమా ప్రీమియంలు పెరిగి ప్రపంచ మార్కెట్ అతలాకుతలం అవుతున్నా ఆయన మౌనంగా ఉండటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసి, ఆ తర్వాత తానే రక్షకుడిగా రంగంలోకి దిగాలని ట్రంప్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అవసరమైతే అమెరికా నేవీ ద్వారా ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తామని చెప్పడం ద్వారా, గల్ఫ్ దేశాలపై తన పట్టును పెంచుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ఉంది.

ఈ గొడవ భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. మన దేశానికి వచ్చే ఎరువుల దిగుమతుల్లో సుమారు 25 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తాయి. అలాగే ఖతార్ నుంచి వచ్చే గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీని ప్రభావం నేరుగా మన వ్యవసాయ రంగంపై పడనుంది.
ఎరువుల కొరత: ఖరీఫ్ సీజన్ ముందు ఇలా జరగడం రైతులకు పెద్ద దెబ్బ.
విద్యుత్ కోతలు: గ్యాస్ సరఫరా తగ్గితే ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లపై ప్రభావం పడుతుంది.
ధరల పెరుగుదల: పెట్రోల్, డీజిల్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం.

భారత్ ఇప్పుడు రష్యా వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తోంది. అయినప్పటికీ, హర్మూజ్ సంక్షోభం త్వరగా ముగియకపోతే దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇక్కడ పంటలు తగ్గితే, భారత్ మళ్ళీ అమెరికా నుంచే ఆహార ఉత్పత్తులు కొనాల్సి వస్తుంది. బహుశా అమెరికా ఆశించేది కూడా ఇదేనేమో సుమీ.