Egg Pickle Recipe: నోరూరించే కోడిగుడ్డు నిల్వ పచ్చడి.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు!

Egg Pickle Recipe

Egg Pickle Recipe

సాధారణంగా మాంసాహార ప్రియులకు పచ్చడి అనగానే చికెన్ లేదా మటన్ పికిల్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, ఎప్పుడూ తినే రొటీన్ పచ్చడి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే కోడిగుడ్లతోనే ఎంతో రుచికరమైన ‘కోడిగుడ్డు నిల్వ పచ్చడి ని తయారు చేసుకోవచ్చు. అన్నంలోకే కాకుండా చపాతీ, పూరీల్లోకి కూడా అద్భుతంగా ఉండే ఈ వెరైటీ రెసిపీ తయారీ విధానం మీకోసం..

కావలసిన పదార్థాలు:

కోడిగుడ్లు: 6 – 8
నూనె: 150 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు
కారం: 3 స్పూన్లు
ఉప్పు: తగినంత
ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా: తగినంత
ఆవపిండి, మెంతిపిండి: అర స్పూన్ చొప్పున
నిమ్మకాయలు: 2

తయారీ విధానం:

ముందుగా కోడిగుడ్లను ఒక బౌల్‌లో పగులగొట్టి, అందులో కొంచెం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి ఆవిరి మీద (ఇడ్లీ పాత్రలో లాగా) ఉడికించుకోవాలి. మిశ్రమం గట్టిపడిన తర్వాత, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి, కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మంటను తక్కువలో ఉంచి, అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా వేయాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా ఇందులో చేర్చి బాగా కలపాలి.

పచ్చడికి మంచి రుచి, వాసన రావడం కోసం పావు స్పూన్ మెంతిపిండి, అర స్పూన్ ఆవపిండి తప్పనిసరిగా చేర్చాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల రసాన్ని కలుపుకుని జాడీలో భద్రపరుచుకోవాలి. అంతే! ఎంతో రుచికరమైన కోడిగుడ్డు నిల్వ పచ్చడి సిద్ధం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ మజానే వేరు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.