Fuel Price India 2026: దేశీయ ఇంధన రంగంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ మార్పులు చేపట్టింది. సామాన్యులకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూనే, విమాన ఇంధనం (ATF)పై కొత్త పన్నులను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 27, 2026 నుండి ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, పెట్రోల్‌పై గతంలో ఉన్న రూ. 13 అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి రూ. 3 కి పరిమితం చేసింది. అలాగే డీజిల్‌పై గతంలో ఉన్న రూ. 10 సుంకాన్ని పూర్తిగా తొలగించి ‘సున్నా’ చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఒకవైపు వాహనదారులకు ఊరటనిస్తూనే, మరోవైపు విమాన ఇంధనం పై ప్రభుత్వం కొత్త పన్నులను ప్రవేశపెట్టింది. ATF పై ఇప్పుడు లీటరుకు రూ. 50 అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. అయితే, వివిధ మినహాయింపుల తర్వాత విమానయాన సంస్థలు చెల్లించాల్సిన నికర పన్ను లీటరుకు సుమారు రూ. 29.5 గా ఉండనుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో ఎగుమతులకు లభించే పన్ను మినహాయింపులను ఇప్పుడు కుదించింది. దేశీయంగా ఇంధన నిల్వలను కాపాడటానికి స్థానిక అవసరాలను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పెట్రోల్, డీజిల్ ATF ఎగుమతి చేసేటప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
భారతదేశం తన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ శ్రీలంకకు పంపే ఇంధనంపై మాత్రం పాత మినహాయింపులనే కొనసాగించనుంది. మన పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ దేశాలకు సరఫరా చేసే ఇంధనంపై ఎలాంటి అదనపు భారం వేయలేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొని ఉంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, దేశీయంగా ఇంధన ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రభుత్వ ఆదాయాన్ని సమన్వయం చేసుకోవడానికి ఆర్థిక శాఖ ఈ ‘రీసెట్’ విధానాన్ని చేపట్టింది.
