చరిత్ర సృష్టించిన భారత కుర్రాళ్లు: ఆరోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమిండియా
అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం జింబాబ్వేలోని హరారే వేదికగాఎంతో జోష్ తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించి, సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఆరోసారి (మొత్తంగా 10వ సారి) ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది అనే చెప్పుకోవాలి.
వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఛేదన
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్) సెంచరీలతో భారత బౌలర్లను ఆడుకున్నారు. అయితే ఇలా ఉండగా 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఏమాత్రం కూడా తడబడకుండా కేవలం 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎంత జోష్ ఈ గేమ్ స్టార్ట్ చేశారో అదే విధంగా గేమ్ కంప్లీట్ చేశారు.అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. 2006లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ సాధించిన 305 పరుగుల రికార్డును భారత్ ఇప్పుడు అధిగమించింది.
ఆరోన్ జార్జ్ సెంచరీ గర్జన
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల మెరుపులు హైలైట్‌గా నిలిచాయి. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఆఫ్ఘన్ బౌలర్లకు వణుకు తెప్పించాడు .
అనంతరం స్టార్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. 104 బంతుల్లో 115 పరుగులు (15 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన ఆరోన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) కూడా అర్ధసెంచరీతో రాణించగా, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా (38 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో ఫైనల్
ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ అజేయంగా నిలిచింది. గ్రూప్ స్టేజ్ నుండి సెమీస్ వరకు ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ఇప్పుడు ఆరోసారి టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఫిబ్రవరి 6న జరగనున్న తుదిపోరులో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది.
