భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మరోసారి అనిశ్చితి నెలకొంది శ్రీలంక వేదికగా జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాతో తలపడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రీడా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న క్రీడా దౌత్యపరమైన చిక్కుముడిని ఐసీసీ ఎలా విడదీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మాజీ అధ్యక్షుడు ఎహ్సాన్ మాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు పాక్ జట్టు హాజరుకావడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చే కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ మొండికేయడం, దానికి ఐసీసీ అంగీకరించకపోవడంతో ఆ దేశాన్ని టోర్నీ నుండి తప్పించడం వంటి పరిణామాలు పాకిస్తాన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. దీనికి నిరసనగానే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ఎత్తుగడ వేస్తోంది.
ఈ వివాదంపై స్పందించిన ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహ్సాన్ మాని పాకిస్తాన్ నిర్ణయాన్ని సమర్థించేలా మాట్లాడారు. ఏ దేశమైనా తన ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంటుందని, అటువంటి సందర్భాల్లో ఐసీసీ ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. గతంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ కూడా పాకిస్తాన్లో ఆడేందుకు నిరాకరించి, తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు భారత్‌పై ఎటువంటి చర్యలు తీసుకోని ఐసీసీ, ఇప్పుడు పాకిస్తాన్‌ను శిక్షిస్తే అది ‘ద్వంద్వ ప్రమాణాలు’ పాటించడమే అవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు.
భారత్ పాకిస్తాన్‌కు వెళ్లకపోయినా తటస్థ వేదికపై (యూఏఈ) ఆడేందుకు సిద్ధపడింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏకంగా తటస్థ వేదిక అయిన శ్రీలంకలో కూడా ఆడబోమని చెప్పడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. ఈ మ్యాచ్ జరగకపోతే సుమారు 4,500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఇది టోర్నమెంట్ ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం ఈ అంశంపై ఐసీసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. పాకిస్తాన్ నుండి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ పాక్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ దేశ క్రికెట్ బోర్డుపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, పాయింట్ల కోత వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
