చెన్నై వేదికగా నేడు భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావోరేవో లాంటిది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో సూర్యకుమార్ యాదవ్ సేన సెమీఫైనల్ ఆశలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం పొంచి ఉంది.
ఈ కీలక మ్యాచ్‌కు ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ‘మంచు’ కూడా పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. చెన్నైలో రాత్రి సమయాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు బంతిపై పట్టు చిక్కడం కష్టమవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి స్టేడియం నిర్వాహకులు ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా నుండి ప్రత్యేకంగా ‘డ్యూ క్యూర్’ అనే కెమికల్‌ను దిగుమతి చేసుకుని మైదానమంతా స్ప్రే చేస్తున్నారు.
ఈ ప్రత్యేక రసాయనాన్ని మంగళ, బుధవారాల్లోనే కాకుండా, నేడు మ్యాచ్ ప్రారంభానికి ముందు మధ్యాహ్నం సమయంలో కూడా మైదానంలో చల్లాలని నిర్ణయించారు. ఈ కెమికల్ వల్ల గడ్డిపై మంచు బిందువులు నిలవవు, తద్వారా అవుట్‌ఫీల్డ్ తడిగా మారకుండా ఉంటుంది. దీనివల్ల టాస్ గెలిచిన జట్టుకే కాకుండా, ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉంటాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా చేపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది, కానీ మంచు పడితే బ్యాటర్లకు పండగే అవుతుంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మ్యాచ్ సమయంలో హ్యుమిడిటీ 80 నుండి 90 శాతం వరకు ఉండవచ్చు. ఇంతటి తేమలో బంతి తడిసి బౌలర్ల నియంత్రణ తప్పుతుంది. అందుకే ఈ ‘ఇంపోర్టెడ్ కెమికల్’ ప్రయోగంపై అందరి దృష్టి నెలకొంది. జింబాబ్వే కూడా తన గత మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది, కాబట్టి వారు కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ టీమిండియాకు మాత్రం ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
నేటి రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ మార్క్ చూపించాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో సమన్వయంతో ఆడితేనే భారత్ సెమీస్ గండం నుంచి గట్టెక్కుతుంది. రోహిత్, విరాట్ వంటి సీనియర్ల గైర్హాజరీలో కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఒకవైపు అమెరికా కెమికల్, మరోవైపు టీమిండియా పట్టుదల వెరసి నేటి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించనుంది.
