India U19 vs England U19 Final : భవిష్యత్తు వచ్చేసింది..టీమిండియా కుర్రాళ్లపై గౌతమ్ అదానీ ప్రశంసల జల్లు

India U19 vs England U19 Final

India U19 vs England U19 Final

జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ సంచలన విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి, రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తు వచ్చేసింది అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

వైభవ్ ఇన్నింగ్స్ ధాటికి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 411/9 భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53), అభిజ్ఞాన్ కుందు (40) కూడా కీలక పరుగులు జోడించారు.

ఇంగ్లాండ్ పోరాటం వృథా
412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి తలవంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్ కాలేబ్ ఫాల్కనర్ (115) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన వారు విఫలమవడంతో ఆ జట్టు 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అంబ్రిష్ 3 వికెట్లతో రాణించగా, దీపేష్, కాన్షిక్ తలో రెండు వికెట్లు తీశారు.

భారత యువ జట్టు విజయంపై గౌతమ్ అదానీ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
6 టైటిళ్లు. ఒకే భారత్. తిరుగులేని విజయం! 1983లో కపిల్ దేవ్ కొట్టిన 175 పరుగుల నుంచి నేడు వైభవ్ సూర్యవంశీ సాధించిన 175 పరుగుల వరకు.. ఈ అంకె భారత క్రికెట్ చరిత్రలో ఒక శకాన్ని సూచిస్తుంది. మన అండర్-19 ఛాంపియన్లు నేటి యువతకు గొప్పతనం అనేది ఒక లక్ష్యం మాత్రమే కాదు, అది వారి గుర్తింపు అని నిరూపించారు. ప్రపంచం చూస్తోంది.. భవిష్యత్తు వచ్చేసింది. జై హింద్ అని అదానీ కొనియాడారు.

భారత క్రికెట్ ఆధిపత్యం
ఈ విజయంతో భారత్ ఒకే సమయంలో ఐదు ప్రధాన ఐసీసీ (ICC) టైటిళ్లను తన ఖాతాలో ఉంచుకుంది:
మెన్స్ టీ20 ప్రపంచకప్ (2024)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025)
మహిళల వన్డే ప్రపంచకప్ (2025)
మహిళల అండర్-19 ప్రపంచకప్ (2025)
పురుషుల అండర్-19 ప్రపంచకప్ (2026)
ఆయుష్ మాత్రే నాయకత్వంలో టీమిండియా ఈ టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచి టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం. భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని ఈ విజయం మరోసారి నిరూపించింది.

https://varthaprabhanjanam.com/student-assaulted-in-ragging-at-bengal-medical-college-west-bengal-news/