మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రకంపనలు మారి మరుగుతున్నాయి. నిన్న జరిగిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు, అల్లుడు ఇరాన్ సైన్యానికి చెందిన కీలక అధికారులు మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. దాదాపు 200 యుద్ధ విమానాలు ఏకకాలంలో ఇరాన్ వ్యాప్తంగా ఉన్న 500 ప్రాంతాలపై విరుచుకుపడటం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. ఖమేనీ మరణం కేవలం ఇరాన్ ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన వల్ల బాధితులుగా మారిన వారందరికీ దక్కిన న్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే వరకు ఈ దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా దుబాయ్‌లోని ఐదు కీలక ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో యుద్ధం జరిగితే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ప్రస్తుతం ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో గల్ఫ్ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు అమెరికా ‘శాంతి’ కోసం ఈ దాడులు చేస్తున్నామని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ పగ తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న భయం ప్రపంచ దేశాల్లో మొదలైంది.
