పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా తమ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యంగా తాము చేస్తున్న పోరాటంలో పొరుగు దేశాలకు నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్ అధికారిక టెలివిజన్ వేదికగా ఆయన ప్రసంగిస్తూ, శాంతి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.
తమ పొరుగు దేశాల భూభాగాల నుంచి ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగనంత కాలం, తాము కూడా వారిపై దాడులు చేయబోమని పెజిష్కియాన్ హామీ ఇచ్చారు. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నామని, ఈ క్రమంలో స్థానిక దేశాల్లో నెలకొన్న అనిశ్చితికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
యుద్ధం మరింత విస్తరించడం ఇరాన్‌కు ఇష్టం లేదని ఆయన ఉద్ఘాటించారు.
ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పినంత మాత్రాన తాము శత్రువులకు లొంగిపోతామని అనుకోవద్దని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఎప్పటికీ ఎవరికీ తలవంచరని, తమను లొంగదీసుకోవాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని ఘాటుగా స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ కారణంగా పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రగిలిపోయిన ఇరాన్, ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం, బూర్జ్ ఖలీఫా వంటి కీలక ప్రాంతాలు మూతపడటంతో పాటు సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడింది.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఖతార్ వంటి దేశాలు తమపై జరిగిన క్షిపణి దాడుల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో, పెజిష్కియాన్ చేసిన ఈ క్షమాపణ ప్రకటన ఉద్రిక్తతలను కొంతైనా తగ్గిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అగ్రరాజ్యాల మధ్య నలుగుతున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
