ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో టీమిండియాకు చుక్కెదురైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్లపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో విరుచుకుపడటంతో ప్రోటీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ తన అపారమైన అనుభవాన్ని రంగరించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మిల్లర్ ఆడిన బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని పఠాన్ అభిప్రాయపడ్డారు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్, “దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయినప్పుడు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మిల్లర్ తన క్లాస్ ఏంటో చూపించాడు. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం అతని బ్యాటింగ్‌లో కనిపించింది.
గత ప్రపంచకప్ ఫైనల్లో మిస్ అయిన అవకాశాన్ని ఈసారి అహ్మదాబాద్ వంటి పెద్ద స్టేడియంలో భర్తీ చేయాలనే పట్టుదల అతనిలో కనిపించింది. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో అతను ఆడిన అర్ధ సెంచరీ మ్యాచ్ విన్నింగ్ నాక్ అని చెప్పవచ్చు” అని కొనియాడారు.మిల్లర్‌కు తోడుగా నిలిచిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ప్రదర్శనను కూడా పఠాన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాధారణంగా 180 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడే బ్రెవిస్, ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడని ప్రశంసించారు. 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్, మిల్లర్‌తో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం లేకపోతే దక్షిణాఫ్రికా ఇంతటి భారీ స్కోరు సాధించేది కాదని పఠాన్ విశ్లేషించారు.
బ్రెవిస్ నుంచి వచ్చిన ఆ 45 పరుగులు చాలా విలువైనవి. మూడు వికెట్లు పడిపోయిన తరుణంలో అతను ఆచితూచి ఆడాడు. దూకుడుగా ఆడే తన సహజ శైలిని పక్కన పెట్టి, భాగస్వామ్యాన్ని నిర్మించడంపై దృష్టి సారించాడు. ఇది ఒక పరిణతి చెందిన బ్యాటర్ లక్షణం అని ఇర్ఫాన్ పేర్కొన్నారు.ఈ విజయంతో దక్షిణాఫ్రికా సూపర్-8 దశలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు, ఈ ఓటమి భారత సెమీఫైనల్ అవకాశాలపై ఒత్తిడి పెంచింది. గురువారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత బౌలింగ్ విభాగానికి బుమ్రా బలాన్ని ఇస్తున్నా, మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
