ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై అతికష్టమ్మీద గెలిచిన భారత్, ఇప్పుడు ఢిల్లీ వేదికగా నమీబియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
అభిషేక్ శర్మకు అనారోగ్యం.. సంజూకు ఛాన్స్?
ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఉదర సంబంధిత సమస్యలు (Stomach Infection) కారణంగా అతను ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ చేసినప్పటికీ, ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. మరియు తాజాగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ అతను కనిపించలేదు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే దీనిపై స్పందిస్తూ.. అభిషేక్ కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పారు.
ఒకవేళ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అదృష్టం పడుతుంది. ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమై బెంచ్‌కు పరిమితమైన సంజూకు, తన సత్తా చాటడానికి ఇది ఒక సువర్ణవకాశం.
జ్వరం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఢిల్లీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అతను నెట్స్‌లో చురుగ్గా బౌలింగ్ చేశాడు. బుమ్రా జట్టులోకి వస్తే, అమెరికాపై మూడు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను బట్టి ఒకవేళ అదనపు స్పిన్నర్ కావాలనుకుంటే, కుల్దీప్ యాదవ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోవచ్చు.
నమీబియాతో తలపడే భారత అంచనా జట్టు:
ఇషాన్ కిషన్, సంజూ శాంసన్/అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ రాణిస్తే టీమిండియా ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.
