APL 2026: అమరావతి క్రికెట్ స్టేడియానికి పూర్వ వైభవం: మంగళగిరిలో ఏపీఎల్ 2026 సందడి!

Mangalagiri Cricket Stadium

Mangalagiri Cricket Stadium

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో ఉన్న మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. చాలా కాలంగా ఎటువంటి మ్యాచ్‌లు లేక వెలవెలబోతున్న ఈ స్టేడియం, ఇప్పుడు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) 2026 సీజన్-5కు ప్రధాన కేంద్రంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఈ స్టేడియం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో క్రికెట్ వాతావరణాన్ని మళ్ళీ ఉరకలెత్తించేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.

మంగళగిరి స్టేడియంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, దీనిని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఏసీఏ నడుం బిగించింది. స్వయంగా కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్‌తో కలిసి స్టేడియాన్ని పరిశీలించి పనులను ప్రారంభించారు. రాబోయే రెండు నెలల్లోనే, అంటే మే నెల నాటికి స్టేడియం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామని వారు ప్రకటించారు. కేవలం మైదానమే కాకుండా, క్రీడాకారులకు అవసరమైన డ్రెస్సింగ్ రూమ్స్, ఫిజియోథెరపీ కేంద్రాలు అత్యాధునిక సౌకర్యాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఏడాది జరగబోయే ఏపీఎల్ సీజన్-5 తొలి మ్యాచ్‌ను మంగళగిరిలోనే నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. గతంలో విశాఖపట్నం స్టేడియాన్ని కేవలం 45 రోజుల్లోనే ఎలాగైతే ఆధునీకరించారో, అదే స్ఫూర్తితో మంగళగిరి స్టేడియాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ లీగ్ మ్యాచ్‌లు కేవలం ఒక్క చోటే కాకుండా విశాఖపట్నం, మంగళగిరి కడప వంటి ప్రాంతాల్లో నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్‌ను పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాల క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. క్రీడాకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం క్రీడల కోటాను 2 శాతం నుండి 3 శాతానికి పెంచడం ఒక కీలక నిర్ణయం. ఇప్పటికే డిఎస్సీ నియామకాల్లో క్రీడాకారులకు 420 పోస్టులను కేటాయించడమే కాకుండా, క్రీడల అభివృద్ధి కోసం రూ.24 కోట్లు వెచ్చించినట్లు క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి కూడా భారీగా నిధులను ప్రతిపాదించారు.

ఇందులో భాగంగానే తిరుపతి, అమరావతి విశాఖపట్నంలను మూడు జోన్లుగా విభజించి క్రీడా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రం పేరు నిలబెడతారని ప్రభుత్వం నమ్ముతోంది. మంగళగిరి స్టేడియం పునఃప్రారంభం కావడం అనేది ఈ దిశగా పడిన ఒక బలమైన అడుగు అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు