Cluster University Update 2026 : రాయలసీమ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి లైన్ క్లియర్!

Cluster University Update 2026

Cluster University Update 2026

కర్నూలు జిల్లా విద్యా ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన క్లస్టర్ యూనివర్సిటీ పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ యూనివర్సిటీని మళ్లీ గాడిలో పెట్టి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ.139 కోట్లు మంజూరు కాగా, గతంలోనే రూసా (RUSA) పథకం కింద రూ.55 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మరో రూ.74.5 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. విద్యావ్యవస్థలో నాణ్యత పెంచేందుకు ‘క్లస్టర్ బేస్ అప్రోచ్’ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం పెరిగి విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్నూలు ప్రాంతంలో పారిశ్రామిక పెట్టుబడులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్లస్టర్ యూనివర్సిటీలో కేవలం సాధారణ కోర్సులే కాకుండా, స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను మరియు పూర్తిస్థాయి విద్యా వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తామని సభకు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా నిర్వీర్యం చేసిందో సభ దృష్టికి తెచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చి ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే, గత ఐదేళ్లలో పనులు నిలిచిపోవడమే కాకుండా, జగన్నాథగట్టు వద్ద నిర్మించిన భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినా, కాంట్రాక్టర్ ఇంకా పనులు మొదలుపెట్టలేదని ఆమె ఫిర్యాదు చేశారు.

ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్టికల్ హారిజంటల్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో వర్సిటీని అభివృద్ధి చేస్తూ, కర్నూలును ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ ప్రకటనతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు రాయలసీమ ప్రాంత వాసుల్లోనూ క్లస్టర్ యూనివర్సిటీపై కొత్త ఆశలు చిగురించాయి