మైదానంలో టీమిండియా ఆటగాళ్లు పరుగుల వర్షం కురిపిస్తుంటే, స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానుల కేరింతలతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. అయితే, ఈ సందడిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో ధోనీ తన భార్య సాక్షితో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక సరదా సన్నివేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మ్యాచ్ చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు గట్టి పోటీ ఇస్తున్న సమయంలో ఒక బంతికి భారత్‌కు వికెట్ దక్కిందని సాక్షి భావించారు. వెంటనే ఎంతో ఉత్సాహంతో ఆమె సీటులో నుంచి లేచి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. అయితే, అది అవుట్ కాదని గ్రహించిన ధోనీ.. ఏమాత్రం తొందరపడకుండా ఎంతో ప్రశాంతంగా సాక్షి వైపు చూస్తూ.. “బైఠ్ జావో” (కూర్చో) అంటూ సైగ చేశారు. ధోనీ ఆ చిన్న నవ్వుతో ఆమెను వారించడం చూసి పక్కనున్న వారు కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ధోనీ ఎప్పుడూ ‘మిస్టర్ కూల్’ లాగే ఉంటారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్ మరోసారి అదరగొట్టారు. సెమీఫైనల్‌లో 89 పరుగులతో వీరవిహారం చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన సంజూ, ఇప్పుడు కీలకమైన సెమీస్‌లో కూడా రాణించడం విశేషం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. “నేను రెండు సెంచరీలు మిస్ అయ్యానని అనుకోవడం లేదు. 97, 89 పరుగులు చేయడం అనేది జట్టు గెలుపులో చాలా ముఖ్యం.
అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్ నా జీవితంలో ఒక గొప్ప క్షణం కాబోతోంది” అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది. సంజూ మెరుపులు, బుమ్రా పదునైన బౌలింగ్ భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాయి. ఇప్పుడు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడానికి సూర్యకుమార్ సేన సిద్ధమైంది. కివీస్‌పై కూడా ఇదే ఊపు కొనసాగిస్తే భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ ముద్దాడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
