టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో ఒకటవ్వబోతున్నారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది. ఈ క్రమంలో ఈ నూతన వధూవరులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అనూహ్యమైన అభినందనలు అందాయి. విజయ్ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావులకు ప్రధాని ప్రత్యేకంగా లేఖ రాస్తూ.. ఈ జంటకు తన ఆశీస్సులు అందజేశారు.
ప్రధాని తన లేఖలో ఈ వివాహాన్ని ఎంతో అందంగా వర్ణించారు. వెండితెరపై విజయ్, రష్మిక ఎన్నో కథల్లో నటించి మెప్పించి ఉండవచ్చు కానీ, వారి నిజ జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త అధ్యాయం ‘దైవం రాసిన స్క్రిప్ట్’ అని ఆయన కొనియాడారు. సినిమా మాయాజాలం కంటే ఈ నిజ జీవిత బంధం మరింత అద్భుతంగా వెలుగులీనుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే హిందూ ధర్మంలోని ‘సప్తపది’ విశిష్టతను గుర్తు చేస్తూ, ఏడు అడుగులు వేయడం ద్వారా వారు జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకున్నారు.
ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కోసం భద్రతను చాలా కఠినతరం చేశారు. ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ప్రైవేట్ బౌన్సర్లతో పాటు పోలీసు బలగాలను కూడా రంగంలోకి దించారు. కేవలం ఆహ్వానం ఉన్న అతిథులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ వేడుకను ఎంత ప్రైవేట్‌గా ఉంచాలనుకున్నా, ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన మాత్రం మామూలుగా లేదు.
రష్మిక తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి సందడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసింది. అందులో భాగంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ (Virosh Premier League) పేరుతో క్రికెట్ మ్యాచ్ కూడా ఆడినట్లు తెలుస్తోంది. అలాగే పెళ్లి భోజనాల మెనూ, డెకరేషన్ ఫోటోలను చూస్తుంటే.. వేడుక ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో అర్థమవుతోంది. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) పేరుతోనే అధికారికంగా ఖరారు చేయడం విశేషం.
తెలుగులో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలో ఒక్కటవుతుండటం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ‘పుష్ప’, ‘యానిమల్’ సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక.. వీరిద్దరి వివాహ వేడుక ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే ఒక స్పెషల్ ఈవెంట్‌గా నిలిచిపోనుంది.
