India-US Relations : ఇరాన్ యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. కాల్‌లో ఆ బిలియనీర్ పాల్గొనడంతో హాట్ టాపిక్..!!

India-US Relations

India-US Relations

India-US Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ కాల్ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ అత్యంత కీలకమైన సంభాషణలో ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒక దేశాధినేత మరో దేశాధినేతతో జరిపే అధికారిక చర్చల్లో ఒక ప్రైవేట్ వ్యక్తి ఇలా భాగస్వామి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు మొదలైన తర్వాత మోదీ, ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, ముఖ్యంగా ఇంధన సరఫరా గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమయంలోనే మస్క్ లైన్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ట్రంప్‌తో విభేదాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్ళీ వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని ఈ పరిణామం సూచిస్తోంది.

ముఖ్యంగా సముద్ర మార్గాల్లో చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గురించి ప్రధాని మోదీ ఈ కాల్‌ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మార్గం సురక్షితంగా ఉండటం ప్రపంచ శాంతికి, ఆర్థిక స్థిరత్వానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా ఈ దారి మూసుకుపోతే భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పవని మోదీ తన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ కాల్‌లో ఎలోన్ మస్క్ ఎందుకు పాల్గొన్నారు? ఆయన ఏదైనా సలహాలు ఇచ్చారా? అన్న విషయంపై స్పష్టత లేదు. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ.. మోదీ, ట్రంప్ మధ్య సంభాషణ చాలా అర్థవంతంగా సాగిందని, వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని పేర్కొంది. మస్క్ ఉనికిని మాత్రం నేరుగా ధ్రువీకరించలేదు. కానీ, అమెరికా మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం మస్క్ పాత్రపై రకరకాల ఊహాగానాలకు తెరలేపుతున్నాయి.

మరోవైపు ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రధాని మోదీ ఇప్పటికే ముఖ్యమంత్రులకు సూచించారు. గల్ఫ్ సంక్షోభం ముదిరితే ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ‘టీమ్ ఇండియా’గా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో అమెరికా, భారత్ మధ్య జరిగిన ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.