Poultry Farm Loan 2026: సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్’ పథకం కింద కోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసే ఔత్సాహికులకు భారీ ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.50 లక్షల వరకు రుణం పొందే వీలుంది. ఇందులో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, మీరు తీసుకున్న అప్పులో 50 శాతం అంటే సగం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు, మాంసం గుడ్ల ఉత్పత్తిని పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
ఈ పథకం కేవలం ఒక్కరికే పరిమితం కాదు. సాధారణ వ్యక్తులతో పాటు, మహిళా స్వయం సహాయక సంఘాలు రైతుల ఉత్పత్తిదారుల సంస్థలు ఉమ్మడి బాధ్యత సంఘాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హేచరీలు లేదా కోళ్ల పెంపక కేంద్రాలను నడపాలనుకునే కంపెనీలు కూడా దీనికి అర్హులే. కేంద్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకానికి సంబంధించిన రుణాలను దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులు మంజూరు చేస్తాయి. నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
ఈ రుణం పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా దరఖాస్తుదారు పేరు మీద కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఒకవేళ మీకు సొంత భూమి లేకపోయినా కంగారు పడక్కర్లేదు కౌలుకు తీసుకున్న భూమిపై కూడా లోన్ తీసుకోవచ్చు, కానీ భూమి యజమానితో కలిసి జాయింట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్’ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులో కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు, లాభనష్టాల అంచనాలను స్పష్టంగా వివరించాలి.
లోన్ మంజూరు కావడంలో ‘సిబిల్ స్కోరు’ కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో మీరు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి ఉంటే, బ్యాంకులు ఈ రుణాన్ని త్వరగా ఆమోదిస్తాయి. అలాగే, కోళ్ల పెంపకంలో కనీస అవగాహన లేదా శిక్షణ పొంది ఉండటం చాలా మంచిది. కోళ్లకు వచ్చే జబ్బులు, వాటికి వేయాల్సిన టీకాలు, మరియు మార్కెటింగ్ మెళకువలు తెలిసి ఉంటే వ్యాపారంలో నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. శిక్షణ సర్టిఫికెట్ ఉంటే దరఖాస్తుకు మరింత బలం చేకూరుతుంది.
ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం తమ జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించవచ్చు. వారు దరఖాస్తు విధానం నోడల్ ఏజెన్సీల పనితీరుపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ వంటి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీ సొంత వ్యాపార కలను నిజం చేసుకోవచ్చు.
