Allu Arjun Controversy: పుష్పరాజ్ దెబ్బకు దిగొచ్చిన పాడ్‌కాస్టర్లు..!!

Allu Arjun Controversy

Allu Arjun Controversy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగిన అసత్య ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. బన్నీని కలిసేందుకు 42 నిబంధనలు పాటించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన పాడ్‌కాస్టర్ స్వీకృతి ఇద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అల్లు అర్జున్ టీమ్ లీగల్ నోటీసులు పంపడానికి సిద్ధమవ్వడంతో తప్పు తెలుసుకున్న సదరు మహిళలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

అసలేం జరిగింది?

కొద్దిరోజుల క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా, అల్లు అర్జున్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్‌ను కలవాలంటే ఆయన టీమ్ ఒక పెద్ద లిస్టు ఇస్తుందని, అందులో దాదాపు 42 నిబంధనలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా హీరో కళ్లలోకి నేరుగా చూడకూడదని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఇలాంటి వింత నియమాలు ఉంటాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసిన బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

తప్పు ఒప్పుకున్న కావేరీ బారువా

తమపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని గ్రహించిన కావేరీ బారువా, సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. నేను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని అంగీకరిస్తున్నాను. అల్లు అర్జున్ టీమ్ నుండి నాకు ఎలాంటి ‘42 కండిషన్ల’ డాక్యుమెంట్ అందలేదు. కేవలం మాటల ప్రవాహంలో వాస్తవాలు సరిచూసుకోకుండా అలా మాట్లాడేశాను. నా వల్ల అల్లు అర్జున్ గారి ప్రతిష్టకు భంగం కలిగితే క్షమించండి అంటూ ఆమె ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.

క్షమాపణలు చెప్పిన పాడ్‌కాస్టర్

మరోవైపు ఈ ఇంటర్వ్యూను హోస్ట్ చేసిన స్వీకృతి కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆ వివాదాస్పద ఎపిసోడ్‌ను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించినట్లు ఆమె తెలిపారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, పరిశ్రమలోని పద్ధతుల గురించి చర్చించే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. తమ ఛానెల్ బాధ్యతాయుతమైన కంటెంట్‌ను మాత్రమే అందిస్తుందని, ఈ ఇబ్బందికర పరిణామాలకు చింతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు మొదటి నుండి ఈ వార్తలను నమ్మలేదు. మలయాళ నటుడు శివ హరిహరన్ లాంటి వారు కూడా స్పందిస్తూ.. అల్లు అర్జున్ చాలా పద్ధతిగా ఉంటారని ఇలాంటి నిబంధనలు ఉంటాయనేది కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది