గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తే, దానిని తెలంగాణ జాతికే జరిగిన అవమానంగా చిత్రీకరించడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లు ఎత్తకుండానే వారిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఇటీవల సిట్ (SIT) ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న రాద్దాంతాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగం అందరికీ ఒక్కటే. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను వారు మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచారని గగ్గోలు పెట్టడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. గత పదేళ్లలో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వారు, పదవుల కోసం పాకులాడేవారు తమకు తామే జాతిపిత ప్రకటించుకోవడంపై సీఎం రేవంత్ విస్మయం వ్యక్తం చేశారు.
ఉద్యమకారుల త్యాగాలు.. నేటి నాయకుల స్వార్థం
రావి నారాయణ రెడ్డి వంటి మహనీయుల చరిత్రను గుర్తు చేస్తూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రావి నారాయణ రెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, ప్రజల కోసం 500 ఎకరాల భూమిని దానం చేశారు. కానీ నేటి కొందరు నేతలు ప్రజల ఆస్తులను దోచుకుని, తిరిగి తమను ప్రశ్నిస్తే ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు అని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం వంటి నిజమైన ఉద్యమకారులను అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు ఈ జాతిపిత’లకు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, బీజేపీ మరియు ప్రాంతీయ పార్టీల వైఖరిపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోందని, దీనిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. చివరగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, నిబద్ధత గల వ్యక్తులకు తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
