Samsung Galaxy S26: శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. S26 ఫీచర్లు ఇండియా ధర వివరాలు ఇవే.!!

Samsung Galaxy S26

Samsung Galaxy S26

శాంసంగ్ కంపెనీ తాజాగా తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ S26’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన S25తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లో శాంసంగ్ కొన్ని కీలకమైన మార్పులు చేపట్టింది. ముఖ్యంగా డిస్‌ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం స్టోరేజ్ విషయంలో ఫోన్ మరింత మెరుగ్గా తయారైంది. అయితే, ఈ అప్‌గ్రేడ్‌ల కారణంగా ఫోన్ ధర కూడా భారీగానే పెరగడం టెక్ ప్రియులను కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, గతంలో ఉన్న 6.2 అంగుళాల స్క్రీన్‌ను ఇప్పుడు 6.3 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2X ప్యానెల్‌గా మార్చారు. బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా 4,000mAh నుండి 4,300mAhకి పెంచారు. దీనివల్ల ఫోన్ కొంచెం పెద్దదిగా అనిపించినా, రోజంతా ఛార్జింగ్ సమస్య లేకుండా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, భారత్ వంటి దేశాల్లో శాంసంగ్ తన సొంత 2nm ఎక్సినోస్ 2600 చిప్‌ను వాడుతుండగా, అమెరికా మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈసారి సాఫ్ట్‌వేర్ పరంగా గెలాక్సీ AIలో మరిన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ముఖ్యంగా ‘పర్‌ప్లెక్సిటీ’ (Perplexity) అనే AI అసిస్టెంట్‌ను ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారు. యూజర్లు కేవలం “హే ప్లెక్స్” అని అనడం ద్వారా లేదా సైడ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ అసిస్టెంట్‌ను వాడుకోవచ్చు. ఇది గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యామ్నాయంగా మరింత వేగంగా సమాచారాన్ని అందిస్తుందని శాంసంగ్ పేర్కొంది. ఇక కెమెరా సెటప్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, AI ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా ఫోటోల నాణ్యతను పెంచారు.

మెమరీ స్టోరేజ్ విభాగంలో శాంసంగ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గెలాక్సీ S26లో 128GB వేరియంట్ ఉండదు. నేరుగా 256GB నుండే స్టోరేజ్ ప్రారంభమవుతుంది. అలాగే 12GB ర్యామ్ (RAM)ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. ఐఫోన్ 17 వంటి ప్రత్యర్థి ఫోన్లతో పోటీ పడటానికే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ర్యామ్ ఇతర విడిభాగాల ధరలు పెరగడం వల్ల ఈ ఫోన్ ధర గతంతో పోలిస్తే సుమారు 100 డాలర్లు పెరిగింది.

ధరల విషయానికి వస్తే, అమెరికాలో ఈ బేస్ మోడల్ ధర 899 డాలర్ల నుండి ప్రారంభమవుతుంది. ఇక భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ. 87,999గా నిర్ణయించారు. ఇది గత మోడల్ కంటే దాదాపు ఏడు వేల రూపాయలు ఎక్కువ. అంటే, ఫీచర్లు పెరిగిన కొద్దీ వినియోగదారుల జేబుకు కూడా చిల్లు పడక తప్పదని అర్థమవుతోంది. మే నెలలో ఇవి పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.