క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి ఫుల్ జోష్‌లో ఉన్న భారత్, ఇప్పుడు న్యూజిలాండ్ ను ఓడించి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వేదికైన అహ్మదాబాద్ పిచ్ ఇప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. గతంలో ఇక్కడ జరిగిన కీలక మ్యాచ్‌ల్లో భారత్‌కు చేదు అనుభవాలు ఉండటంతో, తుది జట్టు ఎంపికపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఈ పిచ్ స్వభావం స్పిన్నర్లకు ఏమాత్రం కలిసిరావడం లేదని గణంకాలు చెబుతున్నాయి. సాధారణంగా భారత జట్టు స్పిన్ బౌలింగ్‌నే నమ్ముకుంటుంది, కానీ అహ్మదాబాద్‌లో స్పిన్నర్ల ఎకానమీ రేటు 9 కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ బంతి అంతగా తిరగకపోవడం, బ్యాటర్లకు అనుకూలించేలా ‘ఫ్లాట్’గా ఉండటంతో స్పిన్నర్లు వికెట్లు తీయడానికి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని ఫైనల్‌లో ఆడించాలా వద్దా అనే సందేహం జట్టు మేనేజ్‌మెంట్‌లో నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా మన స్పిన్నర్లు ఇక్కడ విఫలమవ్వడం గమనార్హం.
మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా ఈ పిచ్‌పై ఇబ్బంది పడే అవకాశం ఉంది. కివీస్ జట్టులో స్పిన్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, అహ్మదాబాద్ స్టేడియంలో వారికి రికార్డులు అంతగా బాలేవు. ఇది పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని చూస్తుంది. నిజానికి ఈ మైదానంలో బంతి బ్యాట్ మీదకు నేరుగా వస్తుంది, దీనివల్ల అభిషేక్ శర్మ వంటి పవర్ హిట్టర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ పిచ్‌ను ఎర్ర మట్టి నల్ల మట్టి మిశ్రమంతో తయారు చేశారు. దీనివల్ల పేస్ బౌలర్లకు ఆరంభంలో కొంత స్వింగ్ దొరికినా, మ్యాచ్ గడిచేకొద్దీ బ్యాటర్ల రాజ్యం నడుస్తుంది. టీమ్ ఇండియా తన బౌలింగ్ విభాగంలో మార్పులు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ వంటి సీనియర్ స్పిన్నర్లపై జట్టు భారం వేస్తుందా? లేక అదనపు పేసర్‌తో బరిలోకి దిగుతుందా? అనేది చూడాలి. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమి గాయం ఇంకా పచ్చిగానే ఉండటంతో, ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకూడదని భారత్ భావిస్తోంది.
స్టేడియం మొత్తం నీలిరంగు జెండాలతో నిండిపోనుంది. లక్షకు పైగా ప్రేక్షకుల మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన జట్టుకే విజయం దక్కుతుంది. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్‌కు ప్రపంచకప్ అందిస్తాడని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. కివీస్ జట్టు ఐసీసీ ఈవెంట్లలో ఎప్పుడూ భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి, ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
