ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. సూపర్-8 దశలో గ్రూప్-2 సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవడంతో, ఆ జట్టు సెమీఫైనల్ బెర్తు ఇప్పుడు ‘చిక్కుల్లో’ పడింది. ఒకప్పుడు తమ చేతుల్లోనే ఉన్న అవకాశాన్ని కివీస్ చేజార్చుకోగా, ఇప్పుడు పాకిస్తాన్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లింది. మిగిలిన ఒక స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కివీస్ ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా, రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. అయితే, శ్రీలంకతో జరగబోయే చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే మాత్రం న్యూజిలాండ్ ఇంటికి వెళ్లక తప్పదు. పాకిస్తాన్ సెమీస్‌కు వెళ్లాలంటే శ్రీలంకపై కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే, మరో 40 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలి. ఇది పాక్‌కు కాస్త కష్టమైనా, అసాధ్యం మాత్రం కాదు. అందుకే కివీస్ క్యాంప్‌లో టెన్షన్ మొదలైంది.
ఈ క్లిష్ట పరిస్థితిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మనసు విప్పాడు. “నిజం చెప్పాలంటే మాకు చాలా భయంగా ఉంది. ఇంగ్లండ్‌పై గెలిచి ఉంటే ఈ పాట్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మా తలరాత పాకిస్తాన్ చేతుల్లో ఉంది. రేపు టీవీ ముందు కూర్చుని పాక్ మ్యాచ్ చూడటం తప్ప మేమేమీ చేయలేం” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక దశలో విజయం దిశగానే సాగింది. కానీ చివరి మూడు ఓవర్లలో కథ అడ్డం తిరిగింది. గ్లెన్ ఫిలిప్స్ వేసిన ఓవర్లో ఏకంగా 22 పరుగులు రావడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్‌లు కివీస్ ఆశలపై నీళ్లు చల్లాయి. తమ ఫీల్డింగ్ లోపాలు, బౌలింగ్‌లో పట్టు కోల్పోవడమే ఈ ఓటమికి కారణమని సాంట్నర్ అంగీకరించాడు.
నేడు రాత్రి శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా లేదా పాకిస్తాన్ స్వల్ప తేడాతో గెలిచినా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా పాక్ గనుక ‘విశ్వరూపం’ ప్రదర్శిస్తే మాత్రం కివీస్ విమానం ఎక్కాల్సిందే. మరి లక్ ఎవరిని వరిస్తుందో చూడాలి.
