అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని అంగన్వాడీలను మరింత బలోపేతం చేయడంతో పాటు, చిన్నారి లోకానికి పౌష్ఠికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సరికొత్త ‘బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో అందుతున్న పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా ఉదయాన్నే వేడివేడి అల్పాహారాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణను పోషకలోప రహిత రాష్ట్రంగా మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ జిల్లాల్లో కౌమార బాలికలు, గర్భిణీలు ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను రూపుమాపేందుకు అదనపు పోషకాహార పథకాలను కూడా సిద్ధం చేయాలని ఆమె సూచించారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తొలుత కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత అన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.
బడ్జెట్ కేటాయింపులపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క పలు కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,199 అంగన్వాడీ భవనాలను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఇప్పటివరకు కేవలం 500 భవనాలు మాత్రమే పూర్తి కావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన భవనాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య ఉండేలా ‘సాక్ష్యం అంగన్వాడీ’ కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కేవలం ఆహారం అందించడమే కాకుండా, సామాజిక మార్పు కోసం కూడా ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణను ‘బాల్య వివాహాలు లేని రాష్ట్రం’గా తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. దీని కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ములుగు జిల్లాలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చిన్నారులకు పాలు అందిస్తున్న పథకం విజయవంతమైందని, ఇలాంటి మరిన్ని మంచి మార్పులను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శృతి ఓజా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే బడ్జెట్లో ఈ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది చిన్నారులకు మేలు జరగనుంది. అంగన్వాడీ కేంద్రాల్లోనే నాణ్యమైన అల్పాహారం లభిస్తుండటంతో హాజరు శాతం పెరగడమే కాకుండా, పేద కుటుంబాల్లోని పిల్లలకు పౌష్ఠికాహార లోపం తలెత్తకుండా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్
