జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రం ఎవరిదన్న ఉత్కంఠకు లాటరీ పద్ధతిలో తెరపడింది. ఇరు పార్టీల బలాబలాలు సరిగ్గా సమానం కావడంతో అధికారులు నిర్వహించిన లాటరీలో అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థులనే వరించింది. దీంతో ఈ రెండు మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. ఇద్దరు స్వతంత్రులు తోడవడంతో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలుపుకుని బీఆర్ఎస్ బలం 16కు చేరింది. మరోవైపు కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఎంతో కలిసి 13 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ కూడా ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇవ్వడం, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో కాంగ్రెస్ బలం కూడా సరిగ్గా 16 వద్ద నిలిచింది. దీంతో అధికారులు లాటరీ తీయగా.. కాంగ్రెస్ అభ్యర్థి పేరు వచ్చింది.
ఇక తొర్రూరు మున్సిపాలిటీలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక్కడ మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించింది. కాంగ్రెస్ కేవలం 7 వార్డులకే పరిమితమైంది. అయితే, కాంగ్రెస్ తన ఎక్స్ అఫీషియో ఓట్ల అస్త్రాన్ని ప్రయోగించింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లు తోడవడంతో కాంగ్రెస్ సంఖ్య ఒక్కసారిగా 9కి పెరిగింది. దీంతో ఇరు పార్టీల బలం సమానమైంది. ఇక్కడ కూడా అదృష్టం పరీక్షించగా లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థే విజేతగా నిలిచారు.
ఎక్స్ అఫీషియో ఓట్లను తెలివిగా వాడుకున్న కాంగ్రెస్, చివరకు లాటరీలోనూ నెగ్గి ఉమ్మడి జిల్లాలో తన పట్టు నిలుపుకుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషంలో అదృష్టం వెన్నుపోటు పొడిచింది అని చెప్పాలి.
