తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఫిర్యాదు చేసింది. పార్టీ పిలుపు మేరకు మాజీ దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిన్నకొండలరావుకు ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవిత్రమైన తిరుపతి దేవదేవుడి ప్రసాదమైన లడ్డూలో పందికొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెబుతూ గత ఏడాది సెప్టెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు పదే పదే అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా అసత్యమని తెలిసినా కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇటీవల సిట్ నివేదికలో హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు జాతీయ స్థాయి ప్రయోగశాలల నుంచి వచ్చిన నివేదికల్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టంగా ధ్రువీకరించారన్నారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తూ దేవదేవుడి ప్రసాదాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వానికి నిజంగా వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే ఇలాంటి పనులు చేయరని ఆయన అన్నారు. నెయ్యి శాంపిల్స్ తీసుకోవడం, నెయ్యి ట్యాంకర్లు రావడం, వాటిని పంపించడం, మళ్లీ వినియోగించడం ఇవన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని సిట్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఒకవేళ ఏమైనా కల్తీ జరిగి ఉంటే దానికి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమేనని ఆరోపించిన వెలంపల్లి, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. గత మూడు రోజులుగా అన్ని ల్యాబ్ రిపోర్టులు యానిమల్ ఫ్యాట్ లేదని చెబుతున్నా చంద్రబాబు నాయుడు కావాలనే అబద్ధాన్ని నిజం చేయాలనే దుష్సంకల్పంతో రోడ్లపై బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకు లాగుతూ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్లపై బ్యానర్లు కట్టింది ఎవరని ప్రశ్నించిన ఆయన, వెంకటేశ్వర స్వామికి ఇంతటి అపచారం చేస్తున్నది చంద్రబాబు నాయుడే అని దుయ్యబట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని అవమానించిన వ్యక్తి, అన్ని విధాలా అపచారాలకు పాల్పడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడేనని తీవ్రంగా విమర్శించారు.
