భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వరుస విజయాల తర్వాత ఇప్పుడు స్లీపర్ రైళ్ల రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ, మార్చి నెలాఖరు నాటికి మరో రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం కానున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ హౌరా-గువహతి మధ్య దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో రైలు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఈ తాజా సమాచారం పెద్ద ఊరటనిస్తోంది.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సంయుక్తంగా ఈ ఆధునిక స్లీపర్ రైళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి పది స్లీపర్ రేక్‌లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ, మార్చి నెలాఖరు నాటికి రెండు రైళ్లను రైల్వే శాఖకు అప్పగించేందుకు అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఈ రైళ్లు ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చిన తర్వాత, వివిధ మార్గాల్లో ట్రయల్ రన్స్ నిర్వహించి, భద్రతా అనుమతులు లభించిన వెంటనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయంలో రైల్వే శాఖ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఒక్క BEML ద్వారానే దశలవారీగా 260 వందే భారత్ రేక్‌లను తయారు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. దీనికి అదనంగా, చెన్నై ఐసీఎఫ్ స్వతంత్రంగా మరో 50 రేక్‌లను రూపొందించనుంది. ఈ రైళ్లలో అత్యంత ఆధునికమైన ప్యాంట్రీ కార్లతో పాటు మొత్తం 24 కోచ్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా, అత్యంత సౌకర్యవంతమైన బెర్తులు, మెరుగైన సెన్సార్ వ్యవస్థలు మరియు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ రైళ్లు ప్రయాణికులను అలరించనున్నాయి.
ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నుండి ప్రతి నెలా ఒక కొత్త వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 10 స్లీపర్ రైళ్లను వివిధ కీలక నగరాల మధ్య నడపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, రాత్రిపూట ప్రయాణించే వారికి విమాన స్థాయి అనుభూతిని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. త్వరలోనే ఈ కొత్త రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
