ViRash Satyanarayana Vratam : కొత్త జంట విజయ్-రష్మిక సత్యనారాయణ వ్రతం.. భోజనాల దగ్గర మొదలైన అసలు రచ్చ!

ViRash Satyanarayana Vratam

ViRash Satyanarayana Vratam

ViRash Satyanarayana Swamy Vratam: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల జైపూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా విజయ్ సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మనపేటలో సందడి చేశారు. అక్కడ కొత్తగా నిర్మించుకున్న ఫామ్ హౌస్‌లో గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయితే, ఈ వేడుక అనంతరం గ్రామస్థులకు వడ్డించిన భోజనాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సాధారణంగా ఏ శుభకార్యమైనా, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి పవిత్ర పూజలు జరిగినప్పుడు అందరికీ శాకాహార భోజనం పెట్టడం మన ఆచారం. కానీ, దేవరకొండ కుటుంబం గ్రామస్థుల కోసం మాంసాహార (నాన్ వెజ్) విందు ఏర్పాటు చేసినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, సమర్థనలు మొదలుపెట్టారు. “దేవుడి వ్రతం చేసుకున్న రోజున మాంసాహారం వడ్డించడం ఏంటి? ఇది పద్ధతి కాదు కదా” అంటూ కొందరు ఆంధ్రా ప్రాంత నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ వాసులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయని వారు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వ్రతం అనేది కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశమని, వ్రతం పూర్తయి పీఠం కదిపిన తర్వాత గ్రామస్థులకు విందు ఇవ్వడంలో తప్పులేదని వారు వాదిస్తున్నారు. ఇంట్లో పూజ చేసేవారు నియమ నిబంధనలు పాటిస్తే సరిపోతుందని, అతిథులకు వారి ఇష్టానుసారం భోజనం పెట్టడం ఇక్కడి సంప్రదాయంలో భాగమేనని క్లారిటీ ఇస్తున్నారు.

కేవలం తెలంగాణలోనే కాదు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉపనయనం లేదా ఇతర పూజల సమయంలో మాంసాహారం వడ్డించే అలవాటు ఉందని మరికొందరు ఉదాహరణలు చూపిస్తున్నారు. భక్తి అనేది మనసులో ఉండాలని, ఆహారపు అలవాట్లను పూజతో ముడిపెట్టి వివాదం చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్-రష్మిక పెళ్లి విందు ఇప్పుడు ప్రాంతీయ ఆచారాల మధ్య చర్చకు దారితీసింది.

ఇక ఈ కొత్త జంట పెళ్లి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినిమా తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే రష్మిక స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రిసెప్షన్ వేడుకలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.