వేసవి కాలం వచ్చిందంటే చాలు, భానుడు భగభగమంటూ మంటలు పుట్టిస్తాడు. ఆ ఉక్కపోత భరించలేక మధ్యతరగతి జనం కూడా ఇప్పుడు ఏసీల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే షాపులోకి వెళ్లగానే మన ముందు పడే మొదటి ప్రశ్న.. 3-స్టార్ ఏసీ కావాలా? 5-స్టార్ ఏసీ కావాలా?. ఈ రెండింటి మధ్య ధరలో కనీసం 5 వేల నుంచి 10 వేల దాకా తేడా ఉంటుంది. మనమేమో తక్కువ రేటుకు వస్తుంది కదా అని 3-స్టార్ ఏసీని తెచ్చేసుకుంటాం. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది.
ఏసీ స్టార్ రేటింగ్ అనేది కేవలం షో కోసం కాదు, అది మన నెలవారీ కరెంటు బిల్లును డిసైడ్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఏసీ అంత తక్కువ కరెంటును వాడుతుంది. అంటే 5-స్టార్ ఏసీ వాడితే మీ బిల్లు తక్కువ వస్తుంది, అదే 3-స్టార్ వాడితే రీడింగ్ స్పీడ్‌గా తిరుగుతుంది. మరి అందరూ 5-స్టార్ ఏసీయే కొనాలా? అంటే అది మీ వాడకం మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ మీరు ఏసీని రోజుకు మూడు నాలుగు గంటలే వాడుతాం అనుకుంటే, 3-స్టార్ ఏసీ కొనడమే తెలివైన పని. ఎందుకంటే 5-స్టార్ కోసం మీరు పెట్టే ఆ ఎక్స్ట్రా 10 వేల రూపాయలు కరెంటు బిల్లు రూపంలో వెనక్కి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ మీరు గనుక రోజుకు పది గంటల పైన ఏసీ వేస్తాం అంటే మాత్రం కళ్లు మూసుకుని 5-స్టార్ తీసుకోవాలి. అలా అయితేనే మీకు కరెంటు బిల్లులో నెలకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఆదా అవుతుంది. అంటే మీరు పెట్టిన ఎక్స్ట్రా పైసలు రెండు ఏళ్లలోనే మీకు కలిసి వస్తాయి. ఆ తర్వాత నుంచి అది మీకు లాభమే.
గది పెద్దగా ఉండి మీరు తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ పెడితే, అది గదిని చల్లబరచడానికి పడే కష్టం వల్ల పవర్ బిల్లు మోత మోగిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీల హవా నడుస్తోంది. పాత ఏసీలు గది చల్లబడగానే ఆగిపోయి మళ్లీ ఆన్ అయ్యేవి, దీనివల్ల పవర్ ఎక్కువ ఖర్చయ్యేది. కానీ ఇన్వర్టర్ ఏసీలు అలా కాదు, కంప్రెసర్ స్పీడ్ తగ్గిస్తూ రూమ్ టెంపరేచర్‌ను కరెక్ట్‌గా మెయింటెన్ చేస్తాయి. కాబట్టి ఏసీ కొనేటప్పుడు కేవలం ఆఫర్లు, తక్కువ రేటు చూడకుండా.. మీ అవసరం ఏంటో తెలుసుకుని కొంటేనే అది మీకు నిజమైన సంక్షేమం.
