మనం రోజూ చేసే పనులే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా శరీరానికి ఇంజిన్ లాంటి మెదడు విషయంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం. వయసు పెరగడం వల్ల కంటే, మనం పాటించే తప్పుడు జీవనశైలి వల్లే మన మెదడు త్వరగా ‘ముసలిది’ అయిపోతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక కాలంలో మెదడు పనితీరును మందగించేలా చేస్తున్న ఆ 7 ప్రధాన అలవాట్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
అన్నింటికంటే ముఖ్యమైనది నిద్ర చాలామంది పని ఒత్తిడిలోనో లేదా వినోదం కోసమో నిద్రను త్యాగం చేస్తుంటారు. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం అంటే మెదడును నెమ్మదిగా చంపేయడమేనని డాక్టర్ పేర్కొన్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే జ్ఞాపకశక్తి మందగించడమే కాకుండా, ఏదైనా విషయాన్ని వేగంగా అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాదు, సరైన నిద్ర లేని వారిలో బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని గణాంకాలతో సహా తెలుపుతున్నారు. నిద్ర అనేది మెదడుకు ఒక రీఛార్జ్ లాంటిదని మనం మర్చిపోకూడదు.
రాత్రిపూట బెడ్ మీద పడుకున్నాక గంటల తరబడి స్మార్ట్ఫోన్ స్క్రోలింగ్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. దీనివల్ల ఫోన్ నుంచి వచ్చే నీలి రంగు వెలుతురు మెదడులో ‘మెలటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీని ఫలితంగా గాఢ నిద్ర ఉండదు, మెదడు ఎప్పుడూ అలసటగానే ఉంటుంది. దీనికి తోడు వ్యాయామం చేయకపోవడం వల్ల మెదడు కణాల పెరుగుదలకు అవసరమయ్యే ‘BDNF’ అనే ప్రోటీన్ తగ్గిపోతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి, మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది.
చాలామంది బీపీ షుగర్ వంటి సమస్యలను కేవలం మందులతోనే సరిపెడతారు, కానీ వాటిని అదుపులో ఉంచుకోవడం ఎంత కీలకమో గమనించరు. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే అవి మెదడులోని సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తులో తీవ్రమైన మతిమరుపు వ్యాధి (డిమెన్షియా)కి దారితీస్తుంది. అలాగే, నిరంతరం ఒత్తిడికి గురవడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రమైన ‘హిప్పోకాంపస్’ పరిమాణం తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నా చితకా విషయాలకు టెన్షన్ పడటం వల్ల మెదడును మనమే కుంచించుకుపోయేలా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి.
చాలామంది గురకను ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తారు. కానీ నిద్రలో గురక పెట్టడం అనేది ‘స్లీప్ అప్నియా’ అనే ప్రమాదకర స్థితికి సంకేతం. దీనివల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీని ఫలితంగా నిద్రలేచిన తర్వాత కూడా ఏదో మత్తులో ఉన్నట్లు (బ్రెయిన్ ఫాగ్) అనిపిస్తుంది. అందుకే, కేవలం మందులే కాకుండా.. సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం ద్వారానే మన మెదడును పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోగలమని సూచిస్తున్నారు. మెదడును కాపాడుకోవడం అంటే మన జీవితాన్ని కాపాడుకోవడమే.
