సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చూస్తున్న ఏపీలోని పేదలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు టిడ్కో (TIDCO) ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన ఈ భారీ పంపిణీ కార్యక్రమం జరగనుంది.
అసెంబ్లీలో మున్సిపల్ శాఖ బడ్జెట్ డిమాండ్లపై జరిగిన చర్చలో మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధుల సమీకరణపై దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా హడ్కో (HUDCO) నుండి రూ. 4,451 కోట్ల రుణం మంజూరైందని, దీనివల్ల ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 36 శాతంగా ఉన్న పట్టణ జనాభా, 2047 నాటికి 60 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ శాఖకు రూ. 14,538.68 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మరియు వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.
పేదల ఆకలి తీర్చడంలో ‘అన్న క్యాంటీన్లు’ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 205 క్యాంటీన్ల ద్వారా కోట్లాది మందికి భోజనం అందించామని, త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో మరో 75 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని కీలక సమాచారం ఇచ్చారు. ఇది పేద వర్గాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమరావతి రాజధాని పనుల గురించి కూడా మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసిందని విమర్శించిన ఆయన ఇప్పుడు పనులు వేగవంతం చేశామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు ఈ నెలలోనే పూర్తి కానున్నాయని, మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
