ఈ ఏడాదిలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో మొదటిది ఈ ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నాడు సంభవించనుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సూర్య గ్రహణం భారతదేశంలో గోచరించదు, కాబట్టి మన దగ్గర సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ గ్రహణం మంగళవారం, అమావాస్య ధనిష్ఠ నక్షత్రం కలయికతో వస్తుండటంతో ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు వివరిస్తున్నారు.
సూర్య గ్రహణం అమావాస్య ఒకే రోజు రావడం వల్ల పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడానికి ఇది అత్యంత శ్రేష్టమైన సమయంగా భావిస్తారు. గ్రహణ సమయంలో ఓం నమః శివాయ, విష్ణు సహస్రనామం లేదా గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి ఇష్ట దైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
మరోవైపు గ్రహణ సమయం అనేది ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉండే కాలం కాబట్టి కొన్ని పనులకు దూరంగా ఉండాలని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో నిద్రపోవడం, ఆహారం తీసుకోవడం లేదా దంతాలు తోముకోవడం వంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం వంటి పనులు కూడా నిషేధమని శాస్త్రం చెబుతోంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు బయటకు రాకూడదని, చాకు లేదా కత్తెర వంటి పదునైన వస్తువులను అస్సలు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. భగవంతుడి నామస్మరణ చేస్తూ ఇంట్లోనే ఉండటం వల్ల గర్భస్థ శిశువుకు రక్షణ కలుగుతుందని నమ్ముతారు.
ఈసారి గ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది కాబట్టి, ఆ రాశి వారు ధనిష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. శాస్త్రీయంగా మన దేశంలో ఇది కనిపించకపోయినా, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ నియమాలు పాటిస్తే మనశ్శాంతి కలుగుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఫిబ్రవరి 17 నాటి గ్రహణం మనకు నేరుగా కనిపించకపోయినా అమావాస్య కలయిక వల్ల ఆధ్యాత్మిక సాధన చేసే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రహణం విడిచిన తర్వాత చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని, ముఖ్యంగా మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుందని తెలుస్తోంది.
