Varanasi Music Update: మహేశ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘వారణాసి’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై క్లారిటీ ఇచ్చిన కీరవాణి.

Varanasi Music Update

Varanasi Music Update

ప్రపంచవ్యాప్త సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎపిక్ అడ్వెంచర్ ‘వారణాసి’ చిత్రం గురించి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఒక తీపి కబురు చెప్పారు. ఖమ్మంలో జరిగిన ‘ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుక’లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు-రాజమౌళి సినిమా సంగీతం గురించి స్పందిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ‘వారణాసి’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జక్కన్న మార్కు విజువల్స్ కు తన సంగీతంతో ప్రాణం పోసేందుకు కీరవాణి సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

రాజమౌళి-కీరవాణి జోడీ అంటేనే ఒక బ్రాండ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా కీర్తిని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన ఈ అన్నదమ్ములు, ఇప్పుడు ‘వారణాసి’తో గ్లోబల్ బాక్సాఫీస్‌పై కన్నేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా కనిపించబోతోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ వంటి అంశాల కలయికతో ఈ సినిమాను రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘వారణాసి’ తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ అని ప్రశంసించారు. ఒక ఇండియన్ సినిమాలో ఇంతటి భారీ స్థాయిలో నటిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్ ఒక కీలకమైన శివ భక్తుడి పాత్రలో మెరవనున్నారు.

రాజమౌళి ఈ సినిమాను కేవలం పాన్-ఇండియా చిత్రంగా కాకుండా, హాలీవుడ్ రేంజ్‌లో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ దశలోనే ఇంటర్నేషనల్ మీడియా టూర్లు నిర్వహిస్తూ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో ఉంటుందని ఇప్పటికే స్పష్టత వచ్చింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన టైటిల్ రివీల్ ఈవెంట్ నుంచి నిన్నటి కీరవాణి అప్‌డేట్ వరకు ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

ఈ ఎపిక్ అడ్వెంచర్‌ను 2027 ఏప్రిల్ 7న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. సింగిల్ పార్ట్ గానే రాబోతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కీరవాణి సంగీత చర్చలు మొదలైతే, అప్పటి నుంచి ప్రమోషన్లు మరింత జోరందుకునే అవకాశం ఉంది. ఏదేమైనా తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేందుకు ‘వారణాసి’ టీమ్ సర్వం సిద్ధం చేస్తోంది.