టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన పాక్ ఇప్పుడు గ్రూప్-A పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఓటమి పరాభవం నుంచి కోలుకోకముందే, ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌కు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో షాదాబ్ చేసిన వ్యాఖ్యలు పాక్ అభిమానులను ఆగ్రహానికి గురిచేయడమే కాకుండా, నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక అభిమాని షాదాబ్‌ను ఉద్దేశించి.. ఏంటి, సెమీ ఫైనల్ వరకు ఇక్కడే ఉంటారా? అని ప్రశ్నించగా, దానికి షాదాబ్ నవ్వుతూ.. ఫైనల్ వరకు ఉంటాం అని బదులిచ్చారు. ఈ వీడియో భారత్‌తో మ్యాచ్‌కు ముందు తీసిందా లేక పాతదా అన్నది స్పష్టత లేనప్పటికీ, టీమ్ ఇండియా చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోయిన తరుణంలో ఇది బయటకు రావడం చర్చనీయాంశమైంది. పాక్ ఆటగాళ్ల అతివిశ్వాసానికి ఇది నిదర్శనమని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మీరు ఫైనల్ వరకు ఉండేది స్టేడియంలో కాదు.. హోటల్ రూమ్‌లో టీవీ ముందు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ విభాగం భారత్‌తో మ్యాచ్‌లో పేకమేడలా కూలిపోయింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఏడు బంతుల్లో కేవలం ఐదు పరుగులు చేసి నిరాశపరచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి పాక్ టాప్ ఆర్డర్ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అటు బౌలింగ్‌లోనూ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది తన లయను కోల్పోయి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో అతను 15 పరుగులు ఇవ్వడం భారత్‌కు భారీ స్కోరు సాధించడానికి అవకాశాన్ని ఇచ్చింది.
ప్రస్తుతం గ్రూప్-Aలో భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకుంది. అమెరికా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ కూడా నాలుగు పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో మూడో స్థానానికి పరిమితమైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో నమీబియాపై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఏదైనా తేడా జరిగితే పాక్ ఇంటికి వెళ్లడం ఖాయం. ఆ జట్టు సీనియర్ ఆటగాళ్ల ఫామ్, కెప్టెన్సీ నిర్ణయాలపై ఇప్పుడు పాకిస్థాన్ మాజీ దిగ్గజాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
