IIT Gandhinagar Internship 2026: డిగ్రీ విద్యార్థులకు ఐఐటీ గాంధీనగర్ బంపర్ ఆఫర్.. సమ్మర్ ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు షురూ!

IIT Gandhinagar Internship 2026

IIT Gandhinagar Internship 2026

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గాంధీనగర్, విద్యార్థుల కోసం అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎంపికైన విద్యార్థులకు కేవలం నాలెడ్జ్ మాత్రమే కాకుండా, భారీ స్థాయిలో స్టైపెండ్ అవార్డులు పొందే అవకాశం కల్పించింది.

ప్రస్తుతం బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన ఇంటర్న్‌లకు వారానికి రూ. 8,000 చొప్పున గరిష్టంగా 12 వారాల పాటు స్టైపెండ్ అందజేస్తారు. అంతేకాకుండా, ఇంటర్న్‌షిప్ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘భలోడియా-ఖేతన్ సమ్మర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు’ కింద రూ. 50,000 నగదు బహుమతిని కూడా అందజేయనున్నట్లు ఐఐటీ గాంధీనగర్ వెల్లడించింది.

ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం మే 7 నుండి ప్రారంభమై జూలై 16, 2026 వరకు దాదాపు ఎనిమిది వారాల పాటు సాగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 5వ తేదీలోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు ఐఐటీ ఫ్యాకల్టీ పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులపై నేరుగా పని చేసే అవకాశం పొందుతారు.

ఐఐటీ గాంధీనగర్ ఈసారి విభిన్న రంగాలకు చెందిన ఆసక్తికరమైన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. వీటిలో ప్రధానంగా మల్టీలింగువల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, డీప్ ఇమేజ్ రీస్టోరేషన్, లేజర్ సర్ఫేస్ టెక్స్చరింగ్, మెడిసినల్ ప్లాంట్స్ క్లోరోప్లాస్ట్ జెనోమ్ అసెంబ్లీ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వంటి అత్యాధునిక అంశాలు ఉన్నాయి. వీటితో పాటు కెమికల్ క్రిస్టలోగ్రఫీ, ఆయిల్-వాటర్ సెపరేషన్ కోసం హైడ్రోఫోబిక్ మెంబ్రేన్స్ వంటి సైన్స్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

అర్హత కలిగిన విద్యార్థులు ఐఐటీ గాంధీనగర్ అధికారిక వెబ్‌సైట్‌లోని ఇంటర్న్‌షిప్ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ ‘ప్రాస్పెక్టివ్ ఇంటర్న్స్’ విభాగంలో వివిధ ఫ్యాకల్టీలు అందిస్తున్న ప్రాజెక్టుల జాబితా కనిపిస్తుంది. తమకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టును ఎంచుకుని, ‘అప్లై నౌ’ బటన్ క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ కాలేజీ చిరునామా, ప్రస్తుత గ్రేడ్ పాయింట్స్ వంటి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.

కెరీర్ పరంగా ఎదగాలనుకునే విద్యార్థులకు, ముఖ్యంగా పరిశోధన రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక గొప్ప వేదిక. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా, రియల్ టైమ్ ప్రాజెక్టుల్లో అనుభవం సంపాదించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.