కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ కీలక అడుగు వేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యువత కోసం ‘గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్’ కోర్సును అధికారికంగా ప్రారంభించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారతీయులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ కోర్సును రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. కేవలం విద్యార్థులే కాకుండా, ఉద్యోగులు కూడా తమ పనిలో ఏఐని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ ‘ఇండియా-అమెరికా కనెక్ట్ అనే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కూడా ప్రకటించారు. సముద్ర గర్భం ద్వారా కొత్త కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా భారత్, అమెరికా మరియు దక్షిణార్ధగోళంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు వల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, డేటా ట్రాన్స్ఫర్ కూడా సులభతరం అవుతుంది. భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తన ప్రసంగంలో సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “వైజాగ్ ఒకప్పుడు చాలా ప్రశాంతమైన, వినమ్రమైన తీర ప్రాంత నగరం. కానీ నేడు అది గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో భారీ స్థాయిలో ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ పవర్ అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేను నిర్మిస్తున్నామని తెలిపారు. దీనివల్ల వేలాది మందికి కొత్త ఉద్యోగావకాశాలు లభించడమే కాకుండా, స్థానిక వ్యాపారాలు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గూగుల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఏఐ సర్టిఫికేట్ కోర్సులో మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ వంటి అధునాతన అంశాలతో పాటు ఏఐని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. గూగుల్ అందించే ఏఐ టూల్స్ పై అభ్యాసకులకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీనివల్ల ఐటీ రంగంలో కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ అనేది కేవలం ఒక పరికరం కాదని, అది మనుషుల జీవన ప్రమాణాలను మార్చే ఒక సాధనమని పిచాయ్ అభివర్ణించారు.
భారత్‌లో ఉన్న అపారమైన మానవ వనరులు సాంకేతిక నైపుణ్యం చూస్తుంటే భవిష్యత్తులో ఏఐ విప్లవానికి భారత్ కేంద్ర బిందువుగా మారుతుందని సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. స్కిల్లింగ్ (Skilling) పై పెట్టుబడి పెట్టడం ద్వారానే యువతకు మంచి భవిష్యత్తు అందించగలమని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ చేపట్టిన ఈ చర్యలు భారత్-అమెరికా దేశాల మధ్య టెక్నాలజీ బంధాన్ని మరింత లోతుగా పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
