T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయం పాలవ్వడంపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాక్ జట్టు సెమీఫైనల్ చేరడంలో విఫలం కావడమే కాకుండా, కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోవడంపై అమీర్ విస్మయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలు సిసలైన ప్రతిభే కరువైందని ఆయన బాంబు పేల్చారు.
ఒక ప్రైవేట్ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమీర్, అంతర్జాతీయ జట్లు పాకిస్థాన్‌ను ఎంత చులకనగా చూస్తున్నాయో వివరించారు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత జట్టులో ఆడే ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం లేదు. అందుకే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లు పాకిస్థాన్ పర్యటనకు వచ్చేటప్పుడు తమ ప్రధాన ఆటగాళ్లను పంపడం లేదు. కేవలం ‘బి’ టీమ్స్‌ను పంపి మమ అనిపిస్తున్నాయి, అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జట్లు భారత్‌లో పర్యటించాల్సి వస్తే, తమ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ‘ఏ’ టీమ్‌ను పంపుతాయని, ఇది పాక్ క్రికెట్ పడిపోయిన స్థాయికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అమీర్ వ్యాఖ్యలకు తోడు, పాక్ మాజీ దిగ్గజాలు జావేద్ మియాందాద్, మొహమ్మద్ యూసుఫ్ మరియు మోయిన్ ఖాన్ కూడా బోర్డు తీరుపై మండిపడ్డారు. రెండేళ్లకు ఒకసారి వచ్చే మెగా ఈవెంట్లలో దేశ పరువు తీస్తున్నారని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునిక టీ20 క్రికెట్ ఒక పద్ధతి ప్రకారం సాగుతోందని, కానీ పాక్ ఆటగాళ్లు ఇంకా పాత కాలపు పద్ధతుల్లోనే ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యమైన మ్యాచుల్లో మా ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. పెద్ద జట్లను ఓడించలేనంత కాలం పాకిస్థాన్ ఇలాగే వెనుకబడి ఉంటుంది,” అని మోయిన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి, శ్రీలంకపై నామమాత్రపు విజయం సాధించిన పాక్ జట్టు ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని అవమానాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
