నిన్న మొన్నటి దాకా వణికించిన చలి మెల్లగా తగ్గి, అప్పుడే ఎండలు ముదురుతున్నాయి. మార్చి వచ్చేసరికి సెగలు ఇంకా ఎక్కువవుతాయని అందరికీ తెలుసు.( Half Day Schools Timings ) అందుకే స్కూల్ పిల్లలు ఎండలో ఇబ్బంది పడకూడదని తెలంగాణ విద్యాశాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల, అంటే మార్చి 16వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులను అమలు చేయబోతున్నారు.
పొద్దున 8 గంటలకే క్లాసులు మొదలై మధ్యాహ్నం 12:30 గంటలు అవ్వగానే బడి గంట కొట్టేస్తారు. పిల్లలందరికీ స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం పెట్టి ఆ వెంటనే ఇంటికి పంపించేస్తారు. దీనివల్ల ఎండ ముదరకముందే పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్లలో మాత్రం చిన్న మార్పు ఉంది. అక్కడ పొద్దున పూట టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి, మిగతా పిల్లలకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల దాకా క్లాసులు నడుపుతారు.
ఇక సెలవుల కోసం ఎదురుచూసే పిల్లలకు కూడా ఒక తీపి కబురు ఉంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 దాకా వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించనుంది. మళ్ళీ జూన్ 12 నుంచి కొత్త చదువుల ఏడాది మొదలవుతుంది. అటు రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఉర్దూ మీడియం స్కూళ్లకు మాత్రం ఈ నెల 19 నుంచే ఒంటిపూట బడులు ఇచ్చారు. ఎండల వల్ల పిల్లలకు వడదెబ్బ తగలకుండా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు పేరెంట్స్, ఇటు టీచర్లు కూడా హ్యాపీగా ఉన్నారు.
