India State Governors Update: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఈ భారీ మార్పులు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణకు శివప్రతాప్ శుక్లా
తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది. 2024 జూలైలో తెలంగాణ బాధ్యతలు చేపట్టిన జిష్ణుదేవ్ వర్మ, దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ సేవలందించారు. ఇప్పుడు ఆయనను కీలకమైన మహారాష్ట్ర రాజ్‌భవన్‌కు పంపడం విశేషం.
కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం మరికొన్ని రాష్ట్రాల్లోనూ కీలక మార్పులు జరిగాయి. వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేశారు.
బిహార్: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధు బాధ్యతలు చేపట్టనున్నారు.
లడఖ్: ఇప్పటివరకు ఢిల్లీ ఎల్జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్‌కు పంపారు.
నాగాలాండ్: నందకిశోర్ యాదవ్‌ను కొత్త గవర్నర్‌గా అపాయింట్ చేశారు.
తెలంగాణ పగ్గాలు చేపట్టబోతున్న శివప్రతాప్ శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1952లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో జన్మించిన ఆయన, విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ ద్వారా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు.1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, యూపీలో పలుమార్లు మంత్రిగా పనిచేశారు.
2017లో మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2023లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వెళ్లిన ఆయన, ఇప్పుడు తెలంగాణకు బదిలీపై వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాలను వేగంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త గవర్నర్ల నియామకంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
